ఛార్జీలు పెంచితే తప్ప.. ఆర్టీసీ గట్టెక్కడం కష్టమే: అధికారులు
ఈ రెండు చర్యలు తీసుకుంటే తప్ప ఆర్టీసీ గట్టెక్కే పరిస్థితి లేదని అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు.;
ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయం అందించడం, బస్సు చార్జీలు పెంచడం ఈ రెండు చర్యలు తీసుకుంటే తప్ప ఆర్టీసీ గట్టెక్కే పరిస్థితి లేదని అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో గురువారం సమీక్ష నిర్వహించారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థికశాఖ సలహాదారు రమేశ్, కార్గో ప్రత్యేకాధికారి కృష్ణకాంత్, ఈడీ యాదగిరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు ఆర్టీసీ పరిస్థితిని సీఎంకు వివరించారు. భారీగా పెరిగిన డీజిల్ ధరలు, లాక్‌డౌన్, పేరుకుపోయిన బకాయిల వల్ల ఆర్టీసీ నష్టాలు కొనసాగుతున్నాయని అధికారులు అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు పెంచితే ఆర్థిక భారం మరింత పెరుగుతుందని తెలిపారు. క్రితం సారి బస్సు చార్జీలు పెంచినప్పుడు లీటర్ డీజిల్ ధర 67రూపాయలుగా ఉండేదని, చాలా స్వల్ప వ్యవధిలోనే లీటర్ ధర 15 రూపాయలు పెరిగిందని అన్నారు. ఈ పెంపు... ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. ఉద్యోగుల జీతాలు పెంచితే ఆర్టీసీపై పడే పెనుభారాన్ని భరించే స్థితిలో ఆర్టీసీ లేదని అన్నారు.
గతంతో పోలిస్తే ఆర్టీసీ పరిస్థితి ఎంతో మెరుగైందని అధికారులు సీఎం కేసీఆర్‌కు తెలిపారు. ప్రభుత్వం అందించిన ఇతోధిక సహాయం, ఆర్టీసీలో తీసుకున్న నిర్ణయాల వల్ల, ఆంధ్రప్రదేశ్‌కు బస్సులు తిప్పడం వల్ల మంచి ఫలితాలు సాధించామని అన్నారు. ఆక్యుపెన్సీ 58 శాతానికి చేరుకోవడంతో రోజుకు 9 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోందని చెప్పారు.
అటు..ఆర్టీసీలో కార్గో సర్వీసులు విజయవంతమయ్యాయని కేసీఆర్ అన్నారు. 17లక్షల 72వేల పార్శిళ్లను గమ్య స్థానాలకు చేరవేయడం ద్వారా ఆర్టీసీకి 22కోట్ల 61 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. కార్గో సేవల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఆర్టీసీ కార్గో సేవల స్పెషల్ ఆఫీసర్ కృష్ణకాంత్‌ను సీఎం కేసీఆర్ ప్రశంసించారు. ఆర్టీసీ కార్గో ద్వారా పంపిన పార్సిళ్లు సకాలంలో, సురక్షితంగా గమ్యం చేరుతాయనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందని అన్నారు. మారుమూల ప్రాంతాలకు, నగరంలోని ఇంటింటికి డోర్ డెలివరీ చేయడం అభినందనీయమని చెప్పారు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు, ప్రయాణీకులకు సేవలు అందించాలని సీఎం పిలుపునిచ్చారు.