RAINS: తెలుగు రాష్ట్రాల్లో వరుణ బీభత్సం
తెలంగాణవ్యాప్తంగా కుండపోత... నీట మునిగిన కామారెడ్డి జిల్లా.. చెరువులను తలపిస్తున్న రోడ్లు... కొట్టుకుపోయిన రైలు పట్టాలు;
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల ధాటికి పలువురు గల్లంతయ్యారు. వివిధ జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
కామారెడ్డిలో క్లౌడ్ బరస్ట్
కామారెడ్డిలో భారీగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రోడ్డుపై నిలిపిన కార్లు వరద ధాటికి నీటిలో కొట్టుకుపోయాయి. రైలు పట్టాలు నీట మునగడంతో రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. బీబీపేట నుంచి కామారెడ్డి వైపు వెళ్లే రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. హౌసింగ్ బోర్డు కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. కామారెడ్డి జిల్లాలో కుండపోత వర్షాల ధాటికి జనజీవనం స్తంభించిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతుండంతోపాటు చాలా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కురుస్తున్న అతి భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో నలుమూలల వరద నీరుపోటెత్తడంతో చాలా కాలనీలు జలమయమై జనాలు బిక్కుబిక్కుమంటూ ఇండ్లలోనే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
గంటగంటకు పెరుగుతున్న వరద
కామారెడ్డి జిల్లా కేంద్రంలో వరద గంట గంటకు పెరుగుతోంది. భారీ వర్షం తగ్గు ముఖం పట్టకపోవడంతో వరద ప్రవాహం తీవ్రతరం అవుతుంది. కామారెడ్డి పట్టణ శివారు కాలనీలు జలవలయంలో చిక్కుకున్నాయి. హౌసింగ్ బోర్డ్ కాలనీ, జి ఆర్ కాలనీ ప్రాంతాల్లో వరద ప్రవాహం నదీ ప్రవాహాన్ని తలపిస్తోంది. భవనాలు మునిగిపోవడంతో అందులో నివాసితులు తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేసుకుంటూ వీడియోలు తీసి పంపుతున్నారు. వరద ముంపును మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయింది. పక్కన ఉన్న బిల్డింగ్‌లో మొదటి అంతస్తులోకే నీరు ఉబికి వస్తోంది. మూడో ఇంటిలో ముగ్గురున్నరు సార్.. వారిలో వికలాంగ చిన్నారి ఉంది.. దయజేసి మా పరిస్థితి ఎలా ఉందో తెలియజేసే ఈ వీడియో చూడండి.. జీఆర్ కాలనీ మొత్తం మునిగిపోయింది. ఎవరైనా రెస్క్యూ టీంను పంపించి మమ్మల్ని రక్షించండి సార్ అంటూ స్థానికుడు విడుదల చేసిన వీడియో వరద ముంపు ఎలా ఉందో తెలియజేస్తుంది.
మెదక్ జిల్లాలో చిక్కుకున్న పదిమంది..
మెదక్ జిల్లాలో వరదల్లో పదిమంది చిక్కుకున్నారు. సహాయం కోసం వారు ఎదురుచూస్తున్నారు. హవేలీ ఘనపూర్ వాగులో నీరు రావడంతో చూడటానికి వారు వెళ్లారు. అదే బ్రిడ్జిపై సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. సీఎస్‌తో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యలకు హెలికాప్టర్ పంపాలని కోరారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. వాతావరణం అనుకూలిస్తే పంపుతామని సీఎస్ రామకృష్ణరావు తెలిపారు. ఇప్పటికే మెదక్‌కు డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి.
సిరిసిల్ల జిల్లాలో ఐదుగురు గల్లంతు
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట సమీపంలో గేదెలను మేపడానికి వెళ్లిన ఐదుగురు గల్లంతయ్యారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులను వెంటనే ఆదుకునేందుకు యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశించారు. ఘటనా స్థలికి వెళ్తున్నట్లు సిరిసిల్ల కలెక్టర్ చెప్పారు. విపత్తు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సిద్ధంగా ఉన్నాయని బండి సంజయ్ వెల్లడించారు. అయితే, గంభీరావుపేటలో భారీ వర్షం పడుతోంది. అప్పర్ మానేరు నుంచి దిగువకు భారీగా నీటిని విడుదల చేశారు. మానేరు వాగులో పశువుల కాపరి నాగయ్య గల్లంతయ్యారు. వాగులో చిక్కుకున్న మరో ఐదుగురు రైతులను రక్షించేందుకు అధికారుల యత్నిస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలో పదివేల కోళ్లు మృతి..
సిద్దిపేట జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. మెదక్ జిల్లాలోని నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామానికి చెందిన ఓ పౌల్ట్రీ ఫారంలోకి వరద నీరు రావడంతో పదివేల కోళ్లు మృతిచెందాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీగా వర్షం కురుస్తోంది. చాలా ప్రాంతాల్లో ఎడతెరపిలేని వర్షం కురుస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.