మరో 3, 4 రోజుల్లో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని.. అభివృద్ధికి మద్దతుగా ఉండేవారిని సర్పంచ్‌లుగా ఎన్నుకోవాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రాష్ట్రంలోనే మొట్టమొదటి సెంట్రలైజ్డ్ కిచెన్‌ను నేడు ప్రారంభించారు. కొడంగల్‌లోని ఎంకేపల్లి వద్ద 2 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆధునిక కిచెన్‌ను అక్షయ పాత్ర ఫౌండేషన్ (హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్) ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) నిధులతో నిర్మించారు. ఈ కేంద్రం నుంచి కొడంగల్ నియోజకవర్గంలోని 312 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 28,000 మంది విద్యార్థులకు ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం సరఫరా కానుంది. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో తరచూ నమోదవుతున్న ఆహార విషప్రయోగ కేసుల నేపథ్యంలో, ఈ పైలట్ ప్రాజెక్ట్ విద్యార్థులకు హైజెనిక్‌గా, పోషకాహారం అధికంగా ఉన్న ఆహారాన్ని అందించడంలో మైలురాయిగా నిలవనుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఏ విద్యార్థి ఆకలితో ఉండొద్దనే..
కొడంగల్‌లో ఏ విద్యార్థీ ఆకలితో ఉండకూడదన్న లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 28 వేల మందికి ఉదయం అల్పాహారం అందిస్తున్నామని వెల్లడించారు. దీంతో ప్రభుత్వ బడుల్లో 5 వేల మంది విద్యార్థులు పెరిగారని ఆయన తెలిపారు. ఢిల్లీకి నోయిడా ఎలాగో... తెలంగాణకు కొడంగల్ అలాగేనని రేవంత్ అన్నారు. లగచర్ల పారిశ్రామికవాడను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని చెప్పారు. మద్దూరు మహిళా సమాఖ్యకు చెందిన ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. ‘‘కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు భూసేకరణకు ప్రయత్నిస్తే కొందరు గిట్టనివారు రైతులను రెచ్చగొట్టారు. అధికారులపై దాడులు చేయించి... వారిపై కేసులయ్యేలా చేశారు. అన్నదాతలతో మాట్లాడి... పరిహారం, ఇందిరమ్మ ఇళ్లు కేటాయించి లగచర్ల, హకీంపేట, పోలేపల్లిల్లో మూడు వేల ఎకరాలను సేకరించాం.” అని రేవంత్ తెలిపారు.
తెలంగాణలో గత డిసెంబర్ నుంచి ప్రభుత్వం చేపట్టిన బ్రేక్‌ఫాస్ట్ పథకం విజయవంతంగా అమలవుతోంది. ఈ పథకం ద్వారా విద్యార్థుల హాజరు శాతం పెరగడం, పేద కుటుంబాల భారం తగ్గడం వంటి సానుకూల ఫలితాలు నమోదయ్యాయి. ఈ కొత్త సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి ఆధునిక వంటశాలలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.