SAD: అంతులేని విషాదాన్ని మిగిల్చిన నాంపల్లి అగ్నిప్రమాదం
అగ్ని ప్రమాదంలో అయిదుగురు మృతి... 22 గంటలపాటు సాగిన రెస్య్కూ ఆపరేషన్... మృతదేహాలు ఉస్మానియాకు తరలింపు
హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ప్రాంతంలో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదం నగరాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. నాంపల్లి స్టేషన్ రోడ్డులో ఉన్న ఓ ఫర్నిచర్ షాపులో శనివారం మధ్యాహ్నం సంభవించిన ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. భవనం సెల్లార్లో చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు సుమారు 22 గంటలకు పైగా సహాయక చర్యలు కొనసాగగా, ఆదివారం ఉదయం ఐదుగురి మృతదేహాలను అధికారులు వెలికితీశారు. ఈ ప్రమాదంలో చిన్నారులు ప్రణీత్, అఖిల్‌తో పాటు బీబీ, ఇంతియాజ్, హబీబ్ మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటన సమయంలో భవనంలో మొత్తం ఆరుగురు ఉన్నట్లు స్థానికులు చెబుతుండగా, మరో వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మృతులంతా సెల్లార్లోనే చిక్కుకుపోయినట్లు సమాచారం. నాంపల్లి స్టేషన్ రోడ్డులోని హిందీ ప్రచార్‌సభ భవనం పక్కనే ఉన్న సాయి విశ్వాస్ ఛాంబర్స్ అనే ఐదంతస్తుల భవనంలో ‘బచ్చాస్ ఫర్నిచర్’ అనే షాపు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి చైనా నుంచి భారీగా ఫర్నిచర్ సరుకు కంటైనర్‌లో రాగా, దానిని భవనంలోని రెండు సెల్లార్లలో నిల్వ చేసినట్లు తెలుస్తోంది. ఈ దుకాణంలో సుమారు 22 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
షాపులో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న యాదయ్య, లక్ష్మి దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి సెల్లార్లోనే నివాసం ఉంటున్నారు. శనివారం పిల్లలు పాఠశాలకు వెళ్లకపోవడంతో సెల్లార్లోనే ఉండిపోయారు. తల్లిదండ్రులు పనిమీద బయటకు వెళ్లగా, మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఒక్కసారిగా సెల్లార్లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో ఉద్యోగులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో దుకాణంలో పనిచేస్తున్న ఇంతియాజ్, హబీబ్ సెల్లార్లో చిక్కుకున్న పిల్లలు మరియు బీబీ అనే వృద్ధురాలిని బయటకు తీసేందుకు లోపలికి వెళ్లారు. అయితే, వారు తిరిగి బయటకు రాలేదు. దీంతో పరిస్థితి మరింత విషమంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్, పోలీసు, హైడ్రా సహా మొత్తం తొమ్మిది విభాగాల అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. పొగ, వేడి కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడింది. భవనం సెల్లార్‌కు జేసీబీ సాయంతో రంధ్రం చేసి లోపలికి చేరుకున్న అధికారులు మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటన భవనం దృఢత్వంపై కూడా అనుమానాలను రేకెత్తించింది. ఇంకా భవనం లోపల వేడి, పొగ కొనసాగుతుండటంతో నాలుగు అంతస్తుల ఈ కట్టడం భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.