ED Notice: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు.. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు నోటీసులు
ED Notice: అటు కర్నాటక కాంగ్రెస్ నేతలను సైతం ఈడీ తమ ముందు విచారణకు రావాలని కోరింది.;
ED Notice:నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ మరోసారి దూకుడు పెంచింది. కేసు విచారణలో భాగంగా కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కూడా నోటీసులు ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి, గాలి అనిల్ కుమార్ ఈడీ ముందు హాజరయ్యారు.
నేషనల్ హెరాల్డ్ కేసును ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద దర్యాప్తు చేస్తోంది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈడీ ముందు విచారణకు హాజరవుతున్నారు. ముఖ్యంగా యంగ్ ఇండియా సంస్థకు ఇచ్చిన విరాళాలపై గీతారెడ్డి, అనిల్‌కుమార్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఈ కేసులో ఇప్పటికే షబ్బీర్ అలీని ప్రశ్నించారు. ఎల్లుండి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని సైతం ప్రశ్నించనున్నారు అధికారులు. ఈడీ నుంచి నోటీసులు వచ్చాయని కాంగ్రెస్ నేతలు కూడా చెబుతున్నారు. అటు కర్నాటక కాంగ్రెస్ నేతలను సైతం ఈడీ తమ ముందు విచారణకు రావాలని కోరింది. రేపు విచారణకు రావాలంటూ కాంగ్రెస్ నేత డీకే శివకుమార్, ఆయన సోదరుడు డీకే సురేష్‌లకు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది.
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీని సైతం ఈడీ విచారణ జరిపింది. దాదాపు 50 గంటలకు పైగా రాహుల్‌గాంధీని ఈడీ ప్రశ్నించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించింది. ఆ సమయంలో కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వానికి, దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. రాజకీయ కక్షతోనే అధికార పార్టీ బీజేపీ.. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.