TG CABINET: హైకోర్టు తీర్పు తర్వాతే ఎన్నికలపై నిర్ణయం
తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు.. ముగ్గురు పిల్లల నిబంధనపై ఆర్డినెన్స్ జారీ
స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే హైకోర్టు మధ్యంతర తీర్పు, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో.. న్యాయ నిపుణుల సలహాలు, సూచనల ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సి ఉంటుందని క్యాబినెట్ నిర్ణయించింది. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం వచ్చే నెల 3న హైకోర్టులో విచారణకు రానుంది కాబట్టి.. ఆ రోజున వెలువడే ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని సర్కార్ నిర్ణయించింది. వచ్చే నెల 7న రాష్ట్ర మంత్రివర్గం మరోసారి సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని తీర్మానించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నందున.. ఈ సమావేశానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరు కాలేదు. క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎంపీ బలరాం నాయక్‌లతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అందుకు వీలుగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో సెక్షన్ 21(3)ని తొలగించాలని మంత్రిమండలి నిర్ణయించింది. అసెంబ్లీ ప్రొరోగ్ అయినందున చట్ట సవరణకు గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్ తేవాల్సి ఉంటుంది. ఆర్డినెన్స్ ప్రతిపాదన దస్త్రాన్ని మంత్రివర్గం ఆమోదించింది.
ముఖ్యమంత్రికి కొండా సురేఖ క్షమాపణలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. తమ ఇంటికి పోలీసులు రావడంతో మా కూతురు సుష్మిత ఆవేశంతో మాట్లాడిందని.. తమ కూతురు తరపున తాను క్షమాపణ అడుతున్నానని సురేఖ అన్నారు. ప్రస్తుతం తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. త్వరలోనే అన్నీ సమసిపోతాయని కొండా సురేఖ స్పష్టం చేశారు. కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా పని చేసిన సుమంత్‌ను అరెస్టు చేసేందుకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి నోటీసులు లేకుండా మంత్రి ఇంటికి వస్తారని ప్రశ్నిస్తూ.. కొండా సురేఖ కూతురు సుస్మిత పోలీసులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే బీసీ మంత్రి అయిన కొండా సురేఖను సీఎం, మంత్రి పొంగులేటి, వేం నరేందర్‌రెడ్డి టార్గెట్ చేశారంటూ సుస్మిత సంచలన ఆరోపణలు చేశారు.