TG: సమ్మక్కసాగర్ ప్రాజెక్ట్‌కు ఛత్తీస్‌గఢ్ గ్రీన్ సిగ్నల్
హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలోని సమ్మక్కసాగర్ ప్రాజెక్ట్‌కు ఎన్ఓసీ ఇచ్చేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అంగీకరించింది. రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయిని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ కలిశారు. నీట మునిగే భూభాగం పరిహారం భరించేందుకు తెలంగాణ అంగీకారం తెలిపింది. ములుగు జిల్లాలో 6.7 టీఎంసీ సామర్థ్యంతో ఈ సమ్మక్క సాగర్ డ్యామ్ నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు వల్ల నల్గొండ, వరంగల్‌లో తాగునీటి సమస్యలకు పరిష్కారం లభించనుంది. రామప్ప–పాకాల లింక్ కెనాల్ కింద కొత్తగా 12,146 ఎకరాలకు నీరు అందుతుంది. వరంగల్, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, ఖమ్మం జిల్లాలకు లబ్ధి చేకూరుతుంది. 90 కిలోమీటర్ల టన్నెల్ నెట్‌వర్క్‌తో భారీ ఇంజనీరింగ్ డిజైన్ ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. మూడు పంప్‌హౌసులు, క్రాస్ డ్రెయినేజ్ వర్క్స్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్నాయి. పరిహారం, పునరావాసం భరించేందుకు తెలంగాణ సిద్ధం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు.
సింగరేణి కార్మికులకు బోనస్
తెలంగాణ ప్రభుత్వం దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు భారీ బోనస్ ప్రకటించింది. లాభాల్లో 34 శాతం కార్మికులకు ఒక్కోరు రూ.1,95,610 చెల్లించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 41,000 శాశ్వత ఉద్యోగులకు మొత్తం రూ.819 కోట్లు, 30,000 కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 ప్రతి వ్యక్తికి బోనస్ ఇవ్వనున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ అందించడం దేశ చరిత్రలోనే తొలిసారిగా జరగడం అని భట్టి పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ సింగరేణి కార్మికులకు అండగా ప్రభుత్వం ఉంటుందన్నారు. జీఎస్టీ మార్పుల వల్ల రాష్ట్ర ఆదాయం కోల్పోవడం, కేంద్రం వయబులిటీ గ్యాప్ ఫండ్ ద్వారా ఈ లోటును భర్తీ చేయాలని రేవంత్‌రెడ్డి సూచించారు. సింగరేణి కార్మికుల కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం ఇచ్చిన ఈ బోనస్ వారి ఆర్థిక భద్రతకు తోడ్పడుతుంది. దీని ద్వారా కార్మికులు దసరా పండుగను ఆనందంగా జరుపుకునే అవకాశం లభిస్తుంది.
సింగరణి కార్మికులను మోసం చేసిన సర్కార్
మరోసారి కార్మికులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగా చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఈ మేరకు ఆమె సోమవారం ఎక్స్ వేదికగా తెలిపారు. 2024-25 సంవత్సరానికి 69.01 ఎంటీ బొగ్గు ఉత్పత్తి చేయడంతో సింగరేణికి రూ.6 వేల కోట్ల నికర లాభాలు వస్తాయని చెప్పారన్నారు. సింగరేణి కార్మికులకు సంస్థ లాభాల్లో 34 శాతం వాటా ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించిందని, ఈ లెక్కన సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ రూపంలో రూ. 2,040 కోట్లు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డలకు ఒకటి కాదు, రెండు చీరలిస్తామని గతంలో చెప్పింది. కానీ మొత్తానికే ఎగ్గొట్టిందని ఎద్దేవా చేశారు. ఆడబిడ్డలను గౌరవించటమంటే కేవలం బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పటం కాదు.. ఆడబిడ్డలకు మాట ఇచ్చినట్లు నెలకు రూ.2500 లతో పాటు, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ కల్వకుంట్ల కవిత చేశారు.