TG: తెలంగాణలో మళ్లీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ!
శాసనసభలో మంత్రి కీలక ప్రకటన
తెలంగాణలో గత పాలకుల హయాంలో అశాస్త్రీయంగా చేపట్టిన మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పునర్వ్యవస్థీకరణను సమగ్రంగా సరిచేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు రామ్మోహన్ రెడ్డి, వీరేశం, పాల్యాయి హరీష్ తదితరులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో మండలాల ఏర్పాటు నుంచి జిల్లాల విభజన వరకు శాస్త్రీయ ప్రాతిపదిక లేకుండా, ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. ప్రజాప్రతినిధుల సూచనలు, స్థానిక అవసరాలు పరిగణనలోకి తీసుకోకుండా జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిందన్నారు. ఫలితంగా ఒకే నియోజకవర్గానికి చెందిన నాలుగు మండలాలు నాలుగు వేర్వేరు జిల్లాల్లో ఉండే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇది పాలన, ప్రజలకు సేవల అందజేతలో తీవ్ర ఇబ్బందులకు దారి తీసిందని పేర్కొన్నారు.
అడ్డగోలుగా విభజన
తమను పొగిడిన వారి కోసం ఒకలా విమర్శించిన వారి కోసం మరోవిధంగా జిల్లాల విభజన జరిగిందని మంత్రి ఆరోపించారు. అదృష్ట సంఖ్యలు, వ్యక్తిగత అభిరుచుల ఆధారంగా కూడా జిల్లాల సరిహద్దులు నిర్ణయించారని విమర్శలు గుప్పించారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్ల అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. రేవంత్ నాయకత్వంలో కేబినెట్లో ఈ అంశంపై విస్తృతంగా చర్చించి, సమగ్ర జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. అధికారుల నుంచి ప్రత్యేక నివేదిక తెప్పించి, అదే శాసనసభలో చర్చ నిర్వహించి, సభ్యులందరి ఆమోదంతోనే జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని హామీ ఇచ్చారు. శాస్త్రీయ ప్రమాణాలు, ప్రజల అవసరాలు, పాలనా సౌలభ్యాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఈ ప్రక్రియను పూర్తిచేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.