TG: సర్కార్ చేతికి కాళేశ్వరం కమిషన్ నివేదిక
సీల్డ్ కవర్లో అందజేసిన జస్టిస్ పీసీ ఘోష్... కీలక అంశాలను ప్రస్తావించిన కమిషన్.. నివేదికలో 115 మంది సాక్ష్యాలు నమోదు;
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కమిషన్ కు ప్రభుత్వం ఇచ్చిన గడువు చివరి రోజున నివేదిక సమర్పించిది. కేసీఆర్ సహా..కాళేశ్వరం ప్రాజెక్టులో పాలు పంచుకున్న కీలకమైన వ్యక్తులందరి వాంగ్మూలు తీసుకుని,రికార్డులు పరిశీలించి జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక సిద్ధం చేశారు. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడం , ఇతర బ్యారేజీలలో సీపేజీ సమస్యలపై విజిలెన్స్ విచారణ జరిగింది. విజిలెన్స్ ప్రాథమిక నివేదికలో తీవ్రమైన నిర్మాణ లోపాలు గుర్తించారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయ విచారణకు ఆదేశించారు, దీని ఫలితంగా కమిషన్ ఏర్పాటైంది.
15 నెలలపాటు విచారణ
కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి విచారణ నివేదికను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించింది. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు నివేదిక అందజేసింది. 2024 మార్చి 14న కమిషన్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 15 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి విచారించింది. 115 మందిని విచారణ చేసి సాక్ష్యాలు నమోదు చేసింది. కమిషన్ నివేదికతో రాహుల్ బొజ్జా సచివాలయానికి చేరుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు నివేదిక అందించారు. నివేదిక సమర్పణతో, ప్రభుత్వం దాని సిఫార్సులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నివేదికలో నిర్మాణ లోపాలు, బాధ్యులపై సిఫార్సులు ,సాంకేతిక సమస్యల పరిష్కార మార్గాలు ఉండవచ్చని భావిస్తున్నారు . కాళేశ్వరం అంశం తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారింది. ఈ విషయంలో మాజీ సీఎం కేసీఆర్ మీద నేరుగా ఆరోపణలను కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని మొత్తాన్ని కక్కిస్తామని.. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ కూడా ప్రకటించారు. ఇప్పుడు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. మొదట కేబినెట్లో ఆమోదించి.. ఆ తర్వాత .. కేసులు నమోదు చేయడం , దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ ప్రారంభించే అవకాశాలుఉన్నాయని అంచనా వేస్తున్నాయి. ఈ నివేదిక తెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారే అవకాశం ఉంది.
1000 పేజీల నివేదిక
బీఆర్కే భవన్‌కి వచ్చిన కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్.. షీల్డ్ కవర్లో రెండు డాక్యుమెంట్లను ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జకు అందజేశారు. 500 పేజీల చొప్పున.. మొత్తం వెయ్యి పేజీలతో కమిషన్ తుది నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి అవకతవకలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సుమారు 15 నెలలపాటు విచారణ జరిపి తుది నివేదికను రూపొందించింది. ఈ నివేదికను ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ, సీఎస్‌కు అందజేస్తారని సమాచారం. మొత్తం 115 మందిని విచారించి సాక్ష్యాలను నమోదు చేసింది. విచారణకు సంబంధించిన తుది నివేదికను సిద్ధం చేసి తాజాగా ప్రభుత్వానికి అందజేసింది. క్రాస్ ఎగ్జామినేషన్, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలను కూడా పరిశీలించింది. విచారణకు చాలా సమయం పట్టడంతో… పలుమార్లు కమిషన్ గడువు కూడా పొడిగించారు. తుది నివేదికలో ఎలాంటి అంశాలను ప్రస్తావించారు..? లోపాలు ఎక్కడున్నాయి…? వీటికి ఎవరు బాధ్యులు వంటి పలు ప్రశ్నలపై కమిషన్ ఎలాంటి నివేదిక ఇచ్చిందనేది ఉత్కంఠగా మారింది. ప్రభుత్వానికి నివేదిక చేరటంతో దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది.