TG: సీబీఐ రాక.. తెలంగాణలో రాజకీయ కాక
తెలంగాణలోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వనున్న సీబీఐ... సీబీఐపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయనున్న ప్రభుత్వం
తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరం అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు నిర్ణయించింది. కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ తర్వాత సీబీఐ దర్యాప్తుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సీబీఐకి కేసు అప్పగించేందుకు ప్రత్యేక ప్రొసీజర్‌ను తీసుకువచ్చారు. రాష్ట్రంలోకి సీబీఐ రాకపై ఉన్న నిషేధ ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 2022లో రాష్ట్రంలోకి సీబీఐ రాకపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిషేధం విధించగా.. ప్రస్తుతం ఆ నిషేధాన్ని ఉపసంహరించుకునేందుకు రేవంత్ సర్కార్ పూనుకుంది. అసెంబ్లీలో కాళేశ్వరంపై చేసిన తీర్మానం కాపీతో పాటు విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్టు, జస్టిస్ చంద్రఘోష్ రిపోర్టులను జత చేసి సీఎస్ రామకృష్ణ రావు ఆధ్వర్యంలో నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖకు లేఖను రాసేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం. రాష్ట్రం నుంచి లేఖ అందిన వెంటనే సీబీఐ స్పెషల్ టీమ్‌తో కాళేశ్వరం అవకతవకలపై విచారణను ప్రారంభించనున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. సీబీఐ, ఈడీ బీజేపీ జేబు సంస్థలు అని స్వయంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధే కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీయబోతున్నదో అనేది ఉత్కంఠ రేపుతోంది. కేసీఆర్, హరీశ్ రావు వంటి దిగ్గజ నేతల పేర్లు ఉండడం సంచలనం రేపుతోంది.
మండలిలో బీఆర్ఎస్ రచ్చ
తెలంగాణ శాసన మండలిలో భారత రాష్ట్ర సమితి సభ్యులు ఆందోళనకు దిగారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగించనున్నట్లు శాసనసభ నిర్ణయించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు భగ్గుమన్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మండలి ఛైర్మన్ పోడియాన్ని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీలు చుట్టుముట్టి నినాదాలు చేశారు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రతులను భారత రాష్ట్ర సమితి సభ్యులు చించివేసి ఛైర్మన్ వైపు విసిరారు. ‘రాహుల్‌కు సీబీఐ వద్దు.. రేవంత్‌కు సీబీఐ ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. భారత రాష్ట్ర సమితి సభ్యుల తీరుపై మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పోడియం వద్దకు రావొద్దని.. కేటాయించిన స్థానాల్లోనే నిరసన తెలపాలని సూచించారు. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీల నిరసనల మధ్యే మంత్రులు బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం పంచాయతీరాజ్ చట్టసవరణ, పురపాలక సంఘాల చట్టసవరణ, అల్లోపతిక్ ప్రైవేటు వైద్య సంరక్షణ సంస్థల చట్టం రద్దు బిల్లులు సభ ఆమోదం పొందినట్లు మండలి ఛైర్మన్ ప్రకటించారు. కాళేశ్వరం వైఫల్యానికి కారణం కేసీఆరేనని బ్యారేజీల ప్రతి అంశంలోనూ ఆయన జోక్యం చేసుకున్నరని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పేర్కొంది. చట్ట ప్రకారం ఆయనపై చర్య తీసుకునే స్వేచ్ఛ కూడా ప్రభుత్వానికి ఉందని ఈ నివేదిక స్పష్టం చేసింది.