TG: రెండేళ్ల ప్రభుత్వ సాఫల్య వైఫల్యాలు
తెలంగాణ రాష్ట్ర రాజకీయం 2023 ఎన్నికలతో మరో మలుపు
తెలంగాణ రాష్ట్ర రాజకీయం 2023 ఎన్నికలతో మరో మలుపు తిరిగింది. దశాబ్దకాలం ఒక్క పార్టీ ఆధిపత్యాన్ని ముగిస్తూ, ‘ప్రజల పాలన–ప్రజలతోనే’ అని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త శకానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల వేళ వెలువరించిన ఆరు ముఖ్య హామీలు, రాష్ట్ర పరిపాలనపై “పూర్తి పారదర్శకత” వాగ్దానం, పాత అవినీతి వ్యవస్థలను కూల్చి కొత్త పరిపాలనా సంస్కృతి నెలకొల్పుతామన్న సంకల్పం ఈ అన్నింటి మధ్య ప్రజల్లో అపారమైన ఆశలు పెరిగాయి. రెండు సంవత్సరాలు గడిచిన ఈ సమయంలో ప్రభుత్వం వాగ్దానాలు ఎంతవరకు నెరవేర్చింది, ప్రజల జీవన ప్రమాణాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి, ఆర్థిక వ్యవస్థ ఎంతవరకు నిలబడింది, పరిపాలనా యంత్రాంగం ప్రభుత్వ దిశకు ఎంతవరకు అనుగుణంగా నడిచింది, మంత్రివర్గం అధికార యంత్రాంగం మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి.
రాజకీయ వాతావరణం ప్రభుత్వం పనితీరుకు ఎలా ప్రభావం చూపింది అనే ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర ప్రజా చర్చల కేంద్రంగా మారాయి. వాస్తవానికి 2023 డిసెంబర్లో తెలంగాణ ప్రజలు రాజకీయ మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించగా, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఆశలు–ఆకాంక్షల తుఫానులో అధికార బాధ్యతలు చేపట్టింది. పది ఏళ్ల తర్వాత మారిన పాలన తీరు ఎలా ఉంటుందన్న ఉత్కంఠ, అమలు చేయవలసిన హామీల భారంతో మొదటి రోజే ప్రభుత్వం తన వేగాన్ని ప్రదర్శించాల్సిన అవసరం వచ్చింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు సేవలను అమలు చేయడం ప్రజల్లో విస్తృత స్పందనను తెచ్చింది. ఒకేసారి మహిళా భద్రత, ఆర్థిక స్వయం శక్తి, వృత్తి–విద్యావకాశాలపై ఈ పథకం ప్రభావం గురించి రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది. రాబోయే నెలల్లో ఈ పథకాన్ని మరింత మెరుగుపరచేందుకు చర్యలు చేపట్టామని ప్రభుత్వం ప్రకటించినా, రవాణా సంస్థలపై పెరిగిన ఆర్థిక భారం బడ్జెట్‌పై ఒత్తిడిని ఉంచింది. ఇదే సమయంలో ఆరోగ్య రంగంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచడం వలన వైద్య సేవలు మరింత అందుబాటులోకి వచ్చాయని ప్రజా వర్గాలు అనుకున్నా, కార్పొరేట్ హాస్పిటళ్ల వాటా పెరిగి ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి వేగం తగ్గిందని నిపుణులు పేర్కొన్నారు. వైద్య సిబ్బంది కొరత, పరికరాల నిర్వహణ సమస్యలు, దూర ప్రాంతాల్లో వైద్య సేవల లోపం ఇంకా సవాలుగా మిగిలాయి.
రైతుల విషయంలో ప్రభుత్వం వ్యవసాయ రుణ మాఫీని అమలు చేస్తామని పునరుద్ఘాటించి, దశలవారీగా చర్యలు ప్రారంభించినా, మొత్తం రుణభారం, వడ్డీ పెరుగుదల, మార్కెట్ ధరల్లో అనిశ్చితి, ఇనుమడించిన వర్షాభావం వంటి అంశాలు రైతు సంక్షోభాన్ని పూర్తిగా తగ్గించలేదు. కొనుగోలు కేంద్రాల వద్ద గందరగోళం, చెల్లింపుల ఆలస్యం, ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించే విధానాలపై ప్రభుత్వం–రైతుల మధ్య పలు సందర్భాల్లో ఉద్రిక్తత ఏర్పడింది. విద్యా రంగంలో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. పలు పాలనా నిర్ణయాలు ఆలస్యం కావడం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో వేల కోట్ల బకాయిలు పేరుకుపోవడం, ప్రైవేట్ కాలేజీల్లో అకాడమిక్ కార్యకలాపాల నిలుపు, విద్యార్థుల నిరసనలు—విద్యా వాతావరణాన్ని అస్థిరం చేశాయి. ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా సిబ్బంది కొరత, మౌలిక వసతుల ఆలస్యం, ఉన్నత విద్యాసంస్థల్లో ఉద్యోగాల స్తోమత లేకపోవడం వల్ల యువతలో నిరాశ పెరిగింది.