Israel Hamas Conflict: గాజాకు చేరిన మానవతా సాయం
కాస్త ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలు
ఇజ్రాయెల్ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గాజాకు ఊరట లభించింది. ఈజిప్టు నుంచి మానవతా సాయం రఫా సరిహద్దు గుండా గాజాకు చేరుతోంది. హమాస్ మిలిటెంట్లు బందీలుగా ఎత్తుకెళ్లిన 200మందిని విడిచి పెట్టేంత వరకు నిత్యావసరాల సరఫరాను పునరుద్ధరించమన్న ఇజ్రాయెల్ అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిడితో ఎట్టకేలకు అందుకు అంగీకరించింది. దీంతో రెండు వారాలుగా సరైన ఆహారం లేక ఇబ్బంది పడుతున్న పాలస్తీనియన్లకు కాస్త ఉపశమనం లభించింది.
గాజాలో మానవతా సంక్షోభం ఏర్పడకుండా ఐరాస, అమెరికాసహా పలుదేశాలు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. మానవతా సాయంతో కూడిన ట్రక్కులు గాజాలో ప్రవేశించాయి. ఈజిప్టు వైపు నుంచి రఫా సరిహద్దు గుండా గాజాకు నిత్యావసరాల సరఫరా మొదలైంది. శుక్రవారమే దాదాపు 200 ట్రక్కుల్లో 3 వేల టన్నులకుపైగా సామగ్రి గాజా సరిహద్దుకు చేరుకుంది.
అయితే ఇజ్రాయెల్ దాడులతో గాజాలోని రహదారులు దెబ్బతిన్నాయి. వేగంగా మరమ్మతులు చేపట్టారు. అమెరికాకు చెందిన ఇద్దరు బందీలను హమాస్ మిలిటెంట్లు విడిచిపెట్టిన కొన్ని గంటల తర్వాత ట్రక్కులు రఫా సరిహద్దు గుండా గాజాలోకి ప్రవేశించాయి. పరిస్థితులు అనుకూలిస్తే మధ్యవర్తులతో చర్చించి మిగతా బందీలను విడిచిపెట్టనున్నట్లు హమాస్ ప్రకటించింది. ఈజిప్టు, ఖతర్‌తోపాటు పలుదేశాలు చేస్తున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది.
ఈనెల 7న హమాస్ మిలిటెంట్లు మెరుపుదాడులు చేయటంతో....గాజాను ఇజ్రాయెల్ దిగ్బంధించింది. బయటి నుంచి ఎవరూ రాకుండా తమ సరిహద్దును మూసివేసింది. శరణార్థులు, హమాస్ మిలిటెంట్లు తమ దేశంలోకి ప్రవేశించకుండా ఈజిప్టు కూడా తమ సరిహద్దును మూసివేసింది. ఇరుదేశాల చర్యలతో గాజాలో నిత్యావసర వస్తువులు, ఆహారం, ఔషధాలకు కొరత ఏర్పడింది. ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్, అమెరికా అధ్యక్షుడు బైడెన్ సూచన మేరకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు....ఈజిప్టు సరిహద్దు నుంచి నిత్యావసరాల సరఫరాకు అంగీకరించారు. ఆస్పత్రుల్లో ఔషధాలు నిండుకోవడంతో క్షతగాత్రులు, దీర్ఘకాలిక రోగుల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. విద్యుత్ లేక జనరేటర్ల వెలుగులో ఆపరేషన్లు నిర్వహించారు. జనరేటర్లు నడిచేందుకు సరిపడా ఇంధనం లేకపోవడంతో కేవలం ఐసీయూకు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అయితే జనరేటర్లు నడిచేందుకు ఇంధనాన్ని నిత్యావసరాలతో పాటే సరఫరా చేస్తారా లేదా అనే విషయమై స్పష్టత లేదు