Florida State University: ఫ్లోరిడా యూనివర్సిటీలో కాల్పులు
ఇద్దరు మృతి.. మరో ఐదుగురికి గాయాలు;
అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. ఫ్లోరిడా యూనివర్సిటీ రక్తసిక్తమైంది. మాజీ విద్యార్థి జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక అప్రమత్తం అయిన పోలీసులు.. నిందితుడిని చాకచాక్యంగా పట్టుకున్నారు.
నిందితుడు ఫీనిక్స్ ఇక్నర్‌గా గుర్తించారు. స్థానిక డిప్యూటీ షెరీఫ్ కుమారుడిగా పోలీసులు కనుగొన్నారు. షెరీఫ్‌కు చెందిన ఆయుధంతో కాల్పులు జరిపినట్లుగా గుర్తించారు. భోజన సమయంలో కాల్పులు జరిగాయి. అయితే మరణించిన వారు విద్యార్థులు కాదని సమాచారం. వారి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. ఇక కాల్పుల ఘటనతో యూనివర్సిటీలో లాక్‌డౌన్ ప్రకటించారు. ప్రస్తుతం అన్ని తరగతులను రద్దు చేశారు.
కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. కాల్పుల గురించి తనకు సమాచారం అందిందని.. ఇది చాలా భయంకరమైన విషయం అని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం యూనివర్సిటీలో 44,000 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు అన్ని రకాలైన తరగతులు రద్దు చేశారు. క్యాంపస్‌లో అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఎవరూ బయటకు రావొద్దని ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా ఆపదలో ఉంటే ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేయాలని పోలీసులు సూచించారు.