Penguins: తీరానికి వేల సంఖ్యలో పెంగ్విన్ కళేబరాలు
ఉరుగ్వే తీరానికి పది రోజులుగా కొట్టుకొస్తున్న పెంగ్విన్ కళేబరాలు.. అంతుబట్టని కారణం...;
తూర్పు ఉరుగ్వే తీరానికి సుమారు 2,000 పెంగ్విన్ కళేబరాలు కొట్టుకువచ్చాయి (Penguins Washed Up Dead). గత పది రోజులుగా ఇలా జరుగుతున్నది. మెగెల్లానిక్ పెంగ్విన్‌లుగా వీటిని గుర్తించారు. ఈ నేపథ్యంలో వేల సంఖ్యలో పెంగ్విన్ పిల్లల మరణానికి కారణం ఏమిటన్నది అంతుపట్టడం లేదు.
తూర్పు ఉరుగ్వే తీరానికి సుమారు 2,000 పెంగ్విన్ కళేబరాలు( Penguins Washed Up Dead) కొట్టుకువచ్చాయి. పది రోజులుగా ఇలా పెంగ్విన్ కళేబరాలు కొట్టుకొస్తూనే ఉన్నాయి. మరణించిన వాటిని మెగెల్లానిక్ పెంగ్విన్‌లుగా వ గుర్తించారు. మరణించిన వాటిలో పిల్ల పెంగ్విన్లు ఎక్కువగా ఉన్నాయని ఉరుగ్వే పర్యావరణ మంత్రిత్వ శాఖ జంతుజాలం విభాగం అధిపతి కార్మెన్ లీజాగోయెన్ తెలిపారు.
అట్లాంటిక్ మహాసముద్రంలో ఇవి చనిపోయి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. పెంగ్విన్ల కళేబరాలు సముద్ర నీటి ప్రవాహంలో కొట్టుకువచ్చి ఉరుగ్వే తీరానికి చేరుకుని ఉంటాయని భావిస్తున్నారు. ఈ పెంగ్విన్లు ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా కారణంగా చనిపోలేదని కార్మెన్ లీజాగోయెన్ తెలిపారు.
సాధారణంగా మెగెల్లానిక్ పెంగ్విన్‌లు దక్షిణ అర్జెంటీనాలో నివసిస్తుంటాయి. శీతాకాలంలో ఆహారం కోసం వలసపోతాయి. వలసపోతున్న పెంగ్విన్లలో కొంత శాతం మరణిస్తుంటాయని సముద్ర జీవజాల నిపుణులు తెలిపారు. మితిమీరిన, అక్రమ చేపలవేట పెంగ్విన్ల మరణానికి కారణం కావచ్చని పర్యావరణవేత్తలు అనుమానం వ్యక్తం చేశారు. అలాగే జూలై మధ్యలో ఆగ్నేయ బ్రెజిల్‌ను తాకిన తుఫాన్ వంటి ప్రతికూల వాతావరణం కారణంగా బలహీనంగా ఉండే పెంగ్విన్ పిల్లలు చనిపోయి ఉంటాయని అంచనా వేశారు.