Pakista: పాక్‌లో పట్టాలు తప్పిన రైలు.... 30 మంది మృతి
పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం... 30 మందికిపైగా మృతి;
పాకిస్థాన్ (Pakistan)లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు(30 people were killed ). కరాచీ నుంచి రావల్పిండి వెళ్తున్న హజారా ఎక్స్ ప్రెస్( Hazara Express) 10 బోగీలు పట్టాలు తప్పాయి. నవాబ్ షా ప్రాంతంలోని సర్హారి రైల్వే స్టేషన్(Sarhari Railway Station) సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో 100 మందికిపైగా( 100 injured) గాయపడ్డారు. రైలులో 17 బోగీల్లో 900 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను రైలు బోగీల నుంచి బయటికి తీసి నవాడ్‌షా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. రైలు ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
రిలీఫ్ రైలును ప్రమాదం జరిగిన ప్రాంతానికి పంపినట్లు ప్రాంతీయ రైల్వే అధికారి ఇలియాజ్ షా తెలిపారు. మృతులు, గాయపడిన వారి గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉందన్నారు. ప్రమాదం నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా సింధ్ ప్రాంతంలో రైళ్ల రాకపోకలను నిలిపేసినట్లు పాక్ రైల్వే మంత్రి సాద్ రఫీక్( Railways Minister Saad Rafiq) తెలిపారు. సహాయ, ట్రాక్ పునరుద్ధరణ పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా రైల్వే అధికారులు ముమ్మరంగా పనిచేస్తున్నారని వివరించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతామని పాక్ రైల్వే మంత్రి తెలిపారు.
హజారా ఎక్స్‌ప్రెస్‌లో సుమారు 1,000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని సింధ్ ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ అలీ షా తెలిపారు. రైలు వేగం గంటకు 50 కిలోమీటర్లు ఉన్నప్పుడు ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. పాకిస్థాన్ ఆర్మీ సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రజలు కూడా ఇందులో భాగస్వాములు అవుతున్నారని పాకిస్థాన్ రైల్వేస్ సుక్కుర్ డివిజనల్ కమర్షియల్ ఆఫీసర్ మొహ్సిన్ సియాల్ తెలిపారు. సహాయక చర్యల్లో సహాయం కోసం అదనపు బలగాలను రప్పించారు. గాయపడిన వారిని రక్షించేందుకు ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్లు కూడా ఘటనాస్థలికి చేరుకుంటున్నాయి.
చివరి బాధితుడిని ఆసుపత్రికి తరలించే వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. రైలు ప్రమాదంలో గాయపడిన ప్రయాణీకులకు మెరుగైన సాయం అందించాలని విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ఆదేశించారు. కాలం చెల్లిన ట్రాక్ నిర్వహణ వ్యవస్థలు, సిగ్నల్ సమస్యలు, సాంకేతిక పరికరాలు, పాత ఇంజన్ల కారణంగా పాకిస్తాన్‌లో రైల్వే ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి. సింధ్‌లో గతంలో ఘోరమైన రైలు ప్రమాదాలు జరిగాయి. 1990లో సుక్కూర్ సమీపంలో జరిగిన ప్రమాదంలో 307 మంది మరణించారు. 2021లో జరిగిన మరోరైలు ప్రమాదంలో 32 మంది మరణించారు మరియు 64 మంది గాయపడ్డారు.