Shubhanshu Shukla: శుభాన్షు శుక్లాను రోదసిలో డ్రాప్ చేసి ..భూమికి చేరిన ఫాల్కన్‌ రాకెట్‌

8 నిమిషాల్లోనే క్షేమంగా తిరిగి భూమిని చేరుకున్న ఫాల్కన్ 9;

Update: 2025-06-25 08:45 GMT

భారత గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను అంతరిక్షంలోకి సాగనంపి ఫాల్కన్ 9 రాకెట్ భూమికి తిరిగి చేరుకుంది. ప్రయోగం మొదలైన 8 నిమిషాల్లోనే డ్రాగన్ క్యాప్సూల్ ను అంతరిక్షంలో వదిలి తిరిగి వచ్చింది. శుక్లాతో పాటు నలుగురు వ్యోమగాములు ఉన్న డ్రాగన్ క్రూ క్యాప్సూల్ నిర్ణీత సమయానికి ఫాల్కన్ 9 రాకెట్ నుంచి విడిపోయింది. ఆ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ క్యాప్సూల్ దాదాపు 28 గంటల పాటు ప్రయాణించి రేపు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఐఎస్ఎస్ కు చేరుకుంటుంది. సాయంత్రం 4:30 గంటలకు ఐఎస్ఎస్ తో అనుసంధానమవుతుందని స్పేస్ ఎక్స్ శాస్త్రవేత్తలు తెలిపారు.

8 నిమిషాల్లోనే తిరిగి రాక..

భారత కాలమానం ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 12:01 గంటలకు డ్రాగన్ క్రూ క్యాప్సూల్ తో ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి ఎగిసింది. కెన్నెడీ స్పేస్ సెంటర్ లోని 39ఏ లాంచ్ కాంప్లెక్స్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. నింగికెగిరిన ఫాల్కన్ రాకెట్ షెడ్యూల్ ప్రకారం ప్రయాణించింది. డ్రాగన్ క్యాప్సూల్ ను అంతరిక్షంలోకి వదిలి తిరిగి భూమి వైపు ప్రయాణం మొదలుపెట్టింది. ప్రయోగం ప్రారంభించిన తర్వాత 8 నిమిషాలకు రాకెట్ తిరిగి భూమిని చేరుకుంది. స్పేస్‌ఎక్స్ కంపెనీ తయారుచేసిన ఈ ఫాల్కన్ 9 రాకెట్ ప్రపంచంలోనే తొలి ఆర్బిటల్-క్లాస్ పునర్వినియోగ రాకెట్ అని శాస్త్రవేత్తలు తెలిపారు.

Tags:    

Similar News