New Virus Variant : కోవిడ్ లాంటి మరో కొత్త వైరస్ గుర్తింపు, ఇది కరోనా కు మించి
ముంచుకొస్తున్న మరో మహమ్మారి..
ప్రపంచవ్యాప్తంగా జీవ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన కరోనా మహమ్మారి పూర్తిగా సమసిపోక ముందే మరో కొత్తం రకం వైరస్ బయటపడడం భయాందోళనలకు గురిచేస్తుంది. గబ్బిలాల నుంచే కరోనా రాకాసి వచ్చిందన్న ఆరోపణలు ఉన్న వేళ తాజాగా గబ్బిలాల నుంచే మరో కొత్తం రకం మహమ్మారి పుట్టుకొచ్చింది. గబ్బిలాల నుంచి మానవులకు సోకే ప్రమాదం ఉన్న కొత్త వైరస్‌ను.. థాయ్‌లాండ్‌లో గుర్తించారు. సరికొత్త వైరస్‌ను గుర్తించినట్లు న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఎకోహెల్త్ అలయన్స్ అనే పరిశోధనా సంస్థ తెలిపింది. దీన్ని ఇంతకు ముందెప్పుడూ చూడలేదని ఇటీవల జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ సమావేశంలో శాస్త్రవేత్త డాక్టర్ పీటర్ దస్జాక్ వెల్లడించారు.
కరోనా స్థాయిలో వ్యాపించే సామర్థ్యం తాజాగా గుర్తించిన కొత్త వైరస్‌కూ ఉందని పీటర్ తెలిపారు. థాయ్‌లాండ్‌లో ఓ గుహలోని గబ్బిలాల్లో దీన్ని గుర్తించినట్లు చెప్పారు. స్థానిక రైతులు ఈ గుహ నుంచి గబ్బిలాల ఎరువును పంట పొలాల్లో ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఎరువులోనే ఆ వైరస్ ఉన్నట్లు వెల్లడించారు. మనుషులతో తరచూ కాంటాక్ట్‌లోకి వస్తున్న ఈ వైరస్ భవిష్యత్‌ల అత్యవసర పరిస్థితులను తీసుకొచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. కొత్తరకం వైరస్‌ను గుర్తించిన ఎకోహెల్త్ పై అనేక వివాదాలు ఉన్నాయి. చైనాలోని వుహాన్ ల్యాబ్‌లో ఎకోహెల్త్ గతంలో పరిశోధనలు జరిపింది. ఈ ల్యాబ్ నుంచే కరోనావైరస్ లీకైందని వచ్చిన అనుమానాలనూ ఈ సంస్థ కొట్టిపారేసింది.
గత ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు.. ఆందోళనకర రీతిలో పెరిగాయి. డిసెంబర్‌లో దాదాపు 10 వేల మరణాలు నమోదయ్యాయని WHO తెలిపింది. కొత్త ఉపవేరియంట్ JN.1 వ్యాప్తితో పాటు సెలవుల నేపథ్యంలో ప్రజలు గుమిగూడటమే అందుకు కారణమని వెల్లడించింది . దీనిపై WHO సంస్థ నిర్వహించిన అత్యవసర సమావేశంలో పీటర్ కొత్త వైరస్ గురించి వెల్లడించారు.
జంతువుల నుంచి, ముఖ్యంగా గబ్బిలాల నుంచి వైరస్‌లు మానవులకు సోకుతుండటంపై పరిశోధనలు చేసి, ‘బ్యాట్‌వుమన్’గా ప్రసిద్ధి చెందిన చైనీస్ వైరాలజిస్ట్ షి ఝెంగ్లి సంచలన హెచ్చరిక చేశారు. భవిష్యత్తులో మరో కొత్త కరోనా వైరస్ పుట్టుకురావొచ్చని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని తెలిపారు. వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన షి బృందం 40 కరోనా వైరస్ జాతుల వల్ల మానవులపై పడే ప్రభావంపై అధ్యయనం చేసింది. వీటిలో దాదాపు సగం వైరస్ జాతులు అత్యంత ప్రమాదకరమైనవని గుర్తించింది.