Imran khan: ఇమ్రాన్ ఖాన్ ఫుడ్ మెనూ విడుదల చేసిన ప్రభుత్వం

ఆరోగ్యంగా ఉన్నారన్న అడియాలా జైలు అధికారులు

Update: 2026-02-18 07:15 GMT

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై గత కొద్దిరోజులుగా రకరకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని.. కంటి చూపును కూడా కోల్పోయారని వార్తలు వినిపిస్తున్నాయి. ఓ వైపు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇంకో వైపు ప్రపంచ వ్యాప్తంగా క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యాన్ని కాపాడాలంటూ పాకిస్థాన్‌ ప్రభుత్వానికి 14 దేశాలకు చెందిన మాజీ కెప్టెన్లు లేఖలు రాశారు. ఇందులో సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ కూడా ఉన్నారు. 2023 ఆగస్టు నుంచి ఇమ్రాన్ ఖాన్ అడియాలా జైల్లో ఉంటున్నారు.

ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ప్రపంచ వ్యాప్తంగా వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టుకు ప్రభుత్వం ఫుడ్ మెనూను వెల్లడించింది. దేశీ చికెన్, మటన్‌తో పాటు డ్రైఫ్రూట్స్ పెడుతున్నట్లుగా పేర్కొంది.

అడియాలా జైలులోని ఏడు గదుల ప్రత్యేక జైలు సముదాయంలో ఇమ్రాన్ ఖాన్ ఉన్నారని.. సహజ వెలుతురుతో పాటు స్వచ్ఛమైన గాలి అందుతోందని పేర్కొంది. అలాగే వ్యాయామం కోసం సైక్లింగ్ యంత్రాలు, జిమ్ పరికరాలు అందించినట్లు తెలిపింది. ఇక ఆహార, పానీయాల్లో ఖర్జూరాలు, వాల్‌నట్‌లు, చికెన్, మటన్, సలాడ్, వేయించిన గుడ్లు, వివిధ ఫ్రూట్ షేక్‌లు అందిస్తున్నట్లు వెల్లడించింది.

ఎండలో కూర్చుని పుస్తకాలు, వార్తాపత్రికలు చదువుతున్నారని నివేదికలో పేర్కొంది. అల్పాహారంలో ఖర్జూరం, వాల్‌నట్‌లు, తేనె, కాఫీ, గంజి, లస్సీ, వేడి పాలు, చియా గింజలు, దానిమ్మ రసం తీసుకుంటున్నారని తెలిపింది. మధ్యాహ్న భోజనంలో దేశీ చికెన్, మటన్, సలాడ్, మిశ్రమ ఊరగాయలు, బంగాళాదుంప చిప్స్, గుడ్లు, వివిధ రకాల పప్పులు ఉన్నాయని చెప్పింది. ఇక సాయంత్రం బాదం, ఎండుద్రాక్ష, తురిమిన కొబ్బరి, పాలు, ఖర్జూరం, అరటిపండ్లు, ఆపిల్ షేక్‌లను తీసుకుంటున్నారని వివరించింది.

Tags:    

Similar News