Israel : హమాస్ దాడి నేపథ్యంలో.. ఇజ్రాయెల్‌కు ఎయిర్ ఇండియా విమానాల రద్దు
ఇజ్రాయెల్-పాలస్తీనా వార్.. 20 నిమిషాలు, 5 వేల రాకెట్లు;
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి నేపథ్యంలో ఆదివారం ఆ దేశానికి విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా నిలిపివేసింది. శనివారం ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడంతో ఎయిర్ ఇండియా టెల్ అవీవ్‌కు బయలుదేరే విమానాలను రద్దు చేసింది. మిలిటెంట్ గ్రూప్ చేసిన దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ యుద్ధ స్థితి ప్రకటించింది.ఈ దాడుల్లో 200 మందికి పైగా ఇజ్రాయిలీలు మరణించగా,వెయ్యి మంది గాయపడ్డారు.
ఏఐ 139 విమానం శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 7.05 గంటలకు టెల్ అవీవ్ చేరుకోవాల్సి ఉంది. తిరుగు ప్రయాణంలో ఏఐ140 విమానం టెల్ అవీవ్ నుంచి రాత్రి 10.10 గంటలకు బయలుదేరి ఆదివారం ఉదయం 7 గంటలకు ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది. అయితే ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్ట్యా విమానాలు రద్దు చేసినట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. శనివారం ఉదయం ఇజ్రాయిల్‌పై హమాస్ అనూహ్యంగా దాడి చేసింది. గాజా నుంచి సుమారు ఐదు వేల క్షిపణులను ప్రయోగించింది. దీనికి ప్రతిగా ఇజ్రాయిల్ కూడా ఎదురు దాడులు ప్రారంభించింది. తాము యుద్ధంలో ఉన్నట్లు ఆ దేశం పక్రటించింది. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితి నెలకొన్నట్లు ఇజ్రాయిల్ వెల్లడించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా శనివారం ఢిల్లీ నుంచి టెల్ అవీవ్‌కు చేరుకుని అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యే విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. సంబంధిత ప్రయాణికులకు అన్ని విధాలా సహకరిస్తామని పేర్కొంది. మరి కొన్ని అంతర్జాతీయ విమాన సంస్థలు కూడా ఇజ్రాయిల్‌కు విమాన సేవలను నిలిపివేశాయి. జర్మన్ విమానయాన సంస్థ లుఫ్తాన్సా, స్విస్ ఎయిర్, ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్, టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో సహా అనేక విమానయాన సంస్థలు ఇజ్రాయిల్‌కు విమానాలను రద్దు చేశాయి.
యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులకు శనివారం ఒక సలహా జారీ చేసింది. ఇజ్రాయెల్‌లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా ప్రోటోకాల్‌లను పాటించాలని అధికారులు కోరారు. హమాస్ శనివారం ఉదయం గాజా నుంచి 5,000 రాకెట్లను ప్రయోగించింది. గాజా స్ట్రిప్‌లోని హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ సైన్యం ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్ ప్రకటించింది.