Air India Flight: ఫ్లైట్ టాయిలెట్లో పాలిథిన్ సంచులు, దుస్తులు..!

చికాగో నుండి న్యూఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపానికి ఇదే కారణం;

Update: 2025-03-11 03:15 GMT

ఎయిరిండియా విమానాల్లో తరచూ సమస్యలు వస్తున్నాయి. కాగా.. ఈ సారి ప్రయాణికులు టాయిలెట్లు లేక అవస్థలు పడ్డారు. గత గురువారం (మార్చి 6)న అమెరికాలోని చికాగో నుండి న్యూఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానం సాంకేతిక కారణాల వల్ల చికాగో విమానాశ్రయంలో తిరిగి ల్యాండ్ కావాల్సి వచ్చింది. అందుకు గల సాంకేతిక కారణంపై విమానయాన సంస్థ వివరణ ఇచ్చింది. కాగా.. ఆ వివరణ చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు.

పాలిథిన్ సంచులు, దుస్తులు, గుడ్డ ముక్కలు వంటి వాటిని విమానం టాయిలెట్లలోకి నెట్టడం వల్ల టాయిలెట్లు మూసుకుపోయాయని.. అవి నిరుపయోగంగా మారాయని తెలపింది. దీంతో.. చికాగో నుండి న్యూఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానం A-126 అమెరికన్ నగరంలో తిరిగి ల్యాండ్ చేయాల్సి వచ్చిందని పేర్కొంది. "ప్రయాణికుల సమస్యను గుర్తించే సరికి విమానం అట్లాంటిక్ మీదుగా ఎగురుతోంది. యూరప్ లోని కొన్ని ప్రాంతాల్లో విమానం మళ్లించవచ్చు.. కానీ చాలా ఎయిర్ పోర్టుల్లో రాత్రి కార్యకలాపాలపై ఆంక్షలు ఉన్నాయి. దీంతో, ఆ విమానాన్ని తిరిగి చికాగోకు మళ్లించాం. ప్రయాణికుల, సౌకర్యం, భద్రతా దృష్ట్యా ఆ నిర్ణయం తీసుకున్నాం" అని ఎయిర్‌లైన్ ప్రకటనలో తెలిపింది.

అసలేం అయ్యిందంటే?

ఎయిర్ ఇండియాకు చెందిన AI126 విమానం మార్చి 6వ తేదీన చికాగో నుంచి ఢిల్లీకి బయలు దేరింది. విమానంలో 300 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. విమానం గాల్లో ఎగురుతున్నప్పుడు పలువురు ప్రయాణికులు టాయిలెట్ల కోసం బాత్రూంలలోకి వెళ్లబోయారు. కానీ ఏ ఒక్క తలుపూ తెరుచుకోలేదు. దీంతో సదరు ప్రయాణికులు సిబ్బందిని అడిగారు. దీంతో సిబ్బంది సైతం టాయిలెట్లను పరీక్షించింది. మొత్తంగా ఆ విమానంలో 12 టాయిలెట్లు ఉన్నాయి. అందులో రెండు ఫస్ట్ క్లాస్ ప్రయాణికుల కోసం కాగా.. మిగతా 10 అందురూ వాడుకోవచ్చు. కానీ వీటిల్లో ఒకే ఒక్క టాయిలెట్ మాత్రమే పని చేసింది. మిగతా వన్నీ పలు సాంకేతిక సమస్యల కారణంగా వాటి తలుపులు తెరుచుకోలేదు. దీంతో అనేక మంది ప్రయాణికులు బాత్రూం వెళ్లేందుకు నానా అవస్థలు పడ్డారు. దీంతో వారంతా సిబ్బందితో గొడవకు దిగారు. ఇక చేసేదేమీ లేక సిబ్బంది ఆ విమానాన్ని అత్యసవరంగా వెనక్కి మళ్లించింది. దాదాపు 100 గంటల పాటు గాల్లో తిరిగి.. ఎక్కడి నుంచి బయలు దేరిందో అక్కడకే చేరుకుంది. ముఖ్యంగా చికాగో చేరుకున్న వెంటనే సదరు ప్రయాణికులు అందరికీ వసతులు కల్పించారు. వారంతా టాయిలెట్లు వాడుకునేలా ప్రత్యేక గదులను ఇచ్చారు. ఆపై వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.

Tags:    

Similar News