US Egg Crisis : బంగారం ధరలతో పోటీపడుతున్న కోడిగుడ్లు.. ఎక్కడంటే ?
డజను గుడ్లు రూ.536!;
అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతోపాటు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ల వార్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. గతంలో ఎప్పుడూలేని విధంగా సరికొత్త రికార్డులను గోల్డ్ రేటు నమోదు చేస్తోంది. ఇదే సమయంలో మేమేం తక్కువ అన్నట్లు బంగారం ధరలతో కోడుగుడ్డు ధరలు పోటీపడుతున్నాయి. అదెక్కడో కాదు.. అగ్రరాజ్యం అమెరికాలో. ప్రస్తుతం అక్కడ కోడిగుడ్ల ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి.
2023 ఆగస్టు నెలలో అమెరికాలో డజను కోడి గుడ్ల ధర 2.04 డాలర్లు (రూ.175). కానీ, ప్రస్తుతం డజను గుడ్ల ధర 6.23 డాలర్లు (రూ.536)కు చేరింది. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఈ ఏడాది చివరి నాటికి అక్కడ డజను కోడిగుడ్ల ధరలు మరో 50శాతం పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు. అంటే.. భారత కరెన్సీలో డజను గుడ్లు రూ. 1200 నుంచి రూ. 1300కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
అమెరికాలో కోడి గుడ్ల ధరలు భారీగా పెరగడానికి బర్డ్ ఫ్లూ కారణం. ఆ దేశంలో బర్డ్ ప్లూ దెబ్బకు కొన్నేళ్లుగా ఉత్తర అమెరికా ఖండమంతా అతలాకుతలమవుతోంది. రెండుమూడేళ్లుగా కోట్లాది కోళ్లను హతమార్చాల్సి వచ్చింది. ఈ ఏడాది జనవరి – ఫిబ్రవరిలో బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అరికట్టడానికి మూడు కోట్ల గుడ్లు పెట్టే కోళ్లను నిర్మూలించడంతో దేశ వ్యాప్తంగా కోడిగుడ్ల కొరతకు దారితీసింది. అయితే, ప్రస్తుతం బర్డ్ ఫ్లూ కేసులు తగ్గుముఖం పట్టడంతో టోకు ధరల సూచీ కాస్త నెమ్మదించినా గుడ్ల ధరలు ఇంకా అదుపులోకి రాలేదు. బర్డ్ ఫ్లూ వచ్చినప్పటి నుంచి అమెరికాలో 16.80 కోట్ల కోళ్లను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వధించారట. వీటిలో అత్యధికంగా గుడ్లు కోసం పెంచే కోళ్లే ఉన్నాయి. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ ప్రభావం తగ్గడంతో చాలా కోళ్ల ఫారాలను శానిటైజ్ చేసి మళ్లీ మెల్లగా గుడ్ల ఉత్పత్తి ప్రారంభిస్తున్నారు.