US Sanctions : ఆరు భారతీయ చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు

ఇరాన్‌ నుంచి పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేసిన సంస్థలపై చర్యలు..;

Update: 2025-07-31 04:15 GMT

భారత్‌పై అగ్రరాజ్యం అమెరికా 25 శాతం టారీఫ్స్ విధించిన వేళ మరో కీలక పరిణామం జరిగింది. ఇండియాకు చెందిన చమురు కంపెనీలపై ట్రంప్ సర్కార్ ఆంక్షలు విధించింది. ఇరాన్‌ నుంచి పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు, మార్కెటింగ్‌ చేస్తున్నారు అనే అభియోగాలపై ప్రపంచ వ్యాప్తంగా 20 సంస్థలపై వైట్ హౌస్ చర్యలు తీసుకుంది. ఇందులో భారత్‌కు చెందిన 6 కంపెనీలు ఉన్నాయి. ఈ మేరకు యూఎస్ విదేశాంగ శాఖ తాజాగా ప్రకటన రిలీజ్ చేసింది. చమురు విక్రయాలతో నిధులు సమకూర్చుకొని మిడిల్ ఈస్ట్ లో సంఘర్షణలు, అస్థిరతకు ఇరాన్‌ ఆజ్యం పోస్తుంది. సొంత దేశ ప్రజలతో పాటు, ప్రపంచాన్ని అణచివేసేందుకు ఉగ్ర ముఠాలకు ఆర్థికంగా సపోర్టు ఇస్తుంది. అందుకే టెహ్రాన్‌పై ఆర్థిక ఒత్తిడి తీసుకొచ్చేందుకు అమెరికా కఠిన చర్యలు విధిస్తుంది. ఇరాన్‌ నుంచి పెట్రోలియం, పెట్రోకెమికల్‌ ఉత్పత్తుల వాణిజ్యంలో భాగస్వాములైన 20 కంపెనీలపై ఆంక్షలు అమలు చేస్తున్నామని అగ్రరాజ్యం ప్రకటన విడుదల చేసింది.

అయితే, భారత్‌తో పాటు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, తుర్కియే, ఇండోనేషియా దేశాలకు చెందిన కంపెనీల పైనా ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఆదేశాల మేరకు ఇరాన్‌ చమురు, పెట్రోకెమికల్‌ ఉత్పత్తులను కొనుగోలు చేయాలనుకునే వారు తమ ఆంక్షల ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుంది అని స్పష్టం చేశారు. అంతేగాక, అగ్రరాజ్యంతో వాణిజ్యం చేసేందుకు అర్హత కోల్పోతారని అమెరికా హెచ్చరించింది.

ఆంక్షలు విధించిన భారత కంపెనీలు ఇవే..

* కాంచన్‌ పాలిమర్స్‌: 2024 ఫిబ్రవరి నుంచి జులై మధ్య 1.3 మిలియన్ డాలర్ల విలువైన ఇరాన్ పాలిథీన్‌, పెట్రోకెమికల్‌ ఉత్పత్తులను UAE మధ్యవర్తిత్వ కంపెనీ నుంచి కొనుగోలు, దిగుమతి చేసుకున్నట్లు అగ్రరాజ్యం అమెరికా ఆరోపలు చేసింది.

* ఆల్‌కెమికల్‌ సొల్యూషన్స్‌: 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఇరాన్ నుంచి 84 మిలియన్ డాలర్ల విలువైన పెట్రోకెమికల్ ఉత్పత్తులను పెట్రోకెమికల్‌ ట్రేడింగ్ కంపెనీ దిగుమతి చేసుకునట్లు అమెరికా పేర్కొంది.

* రమణిక్‌లాల్ ఎస్ గోసాలియా అండ్ కంపెనీ: 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు 22 మిలియన్‌ డాలర్ల విలువైన మిథనాల్, టోల్యూన్‌, పెట్రోకెమికల్‌ ఉత్పత్తులను బైయింగ్, ఇంపోర్ట్ చేసుకున్నట్లు యూఎస్ తెలిపింది.

* జుపిటర్ డై కెమ్ ప్రైవేట్ లిమిటెడ్: 2024-25లో 49 మిలియన్ డాలర్లకు పైగా విలువైన ఇరాన్ ఉత్పత్తులను ఇంపోర్టు చేసినట్లు అమెరికా తమ అభియోగాల్లో వెల్లడించింది.

* గ్లోబల్ ఇండస్ట్రియల్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌: గతేడాది కాలంలో 51 మిలియన్‌ డాలర్ల విలువైన పెట్రోకెమికల్స్‌ను టెహ్రాన్ నుంచి కొన్నట్లు అగ్రరాజ్యం ఆరోపించింది.

* పర్సిస్టెంట్ పెట్రోకెమ్ ప్రైవేట్ లిమిటెడ్: గతేడాది 14 మిలియన్ డాలర్ల విలువైన మిథనాల్‌తో సహా ఇరాన్ పెట్రో కెమికల్స్‌ను కొనుగోలు చేసినట్లు యూఎస్ ఆరోపణలు చేసింది. అయితే, ఈ కంపెనీలు అన్నీ ఉద్దేశపూర్వకంగానే టెహ్రాన్ తో వాణిజ్యంలో భాగస్వాములు అయ్యాయని అమెరికా చెప్పుకొచ్చింది. కాగా, ఈ ఆంక్షలు విధింపుతో ఇప్పుడు ఆయా కంపెనీలు, వ్యక్తులకు యూఎస్ లో ఆస్తులు ఉంటే వాటిని ఫ్రీజ్‌ చేయనున్నారు.

Tags:    

Similar News