Boeing 737: టేకాఫ్ సమయంలో మంటలు, విమానానికి తప్పిన పెను ప్రమాదం
డెన్వర్ విమానాశ్రయంలో AA3023 ల్యాండింగ్ గేర్‌లో మంటలు;
వరుస విమాన ప్రమాద ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం జరిగిన ఓ ఘటన సంచలనం సృష్టించింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం AA3023 ల్యాండింగ్ గేర్‌లో మంటలు చెలరేగడంతో విమానాన్ని రన్‌వేపై నిలిపివేసి, అందులోని 179 మంది ప్రయాణికులను సురక్షితంగా డీ బోర్డు చేయించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి, దీనితో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది.
ఈ ఘటన అమెరికా కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 2:45 గంటల సమయంలో జరిగింది. బోయింగ్ 737 మాక్స్ విమానం డెన్వర్ నుండి మయామి వైపు రన్‌వే 34L నుండి టేకాఫ్ అవుతున్న సమయంలో ల్యాండింగ్ గేర్‌లో మంటలు చెలరేగాయని డెన్వర్ అగ్నిమాపక విభాగం తెలిపింది. విమానంలో 173 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. అధికారులు చెబుతున్న దాని ప్రకారం, విమానం టైర్‌లో సమస్య తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ సమస్య కారణంగా విమానాన్ని రన్‌వేపై అత్యవసరంగా నిలిపి, ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాల్సి వచ్చింది. ప్రయాణికులను బస్సుల ద్వారా టెర్మినల్‌కు తరలించారు. సంఘటన సమయంలో ఐదుగురు వ్యక్తులను స్థలంలోనే పరీక్షించారు, కానీ వారికి ఆసుపత్రి చికిత్స అవసరం పడ లేదు. అయితే, గేట్ వద్ద ఉన్న ఒక వ్యక్తికి స్వల్ప గాయాలు కావడంతో వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దర్యాప్తు ప్రారంభించింది.