New Zealand Earthquake: న్యూజిలాండ్ లో భారీ భూకంపం

రిక్టర్ స్కేల్‌పై 6.5గా నమోదు;

Update: 2025-03-25 04:15 GMT

న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. సౌత్ ఐలాండ్ పశ్చిమ తీరంలో ఈ ఉదయం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై 6.5గా నమోదైంది. అయితే భారీగా భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రివర్టన్ తీరంలో మంగళవారం ఉదయం శక్తివంతమైన భూకంపం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం… ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5 నుంచి 6.8 మధ్య ఉన్నట్లుగా పేర్కొంది. భూకంప కేంద్రం భూమికి పశ్చిమ నైరుతి దిశలో 159 కిలోమీటర్ల దూరంలో ఏర్పడినట్లుగా తెలిపింది. ఆస్తి, ప్రాణ నష్టాల గురించి ఇంకా వార్తలు అందలేదు. భూప్రకంపనలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రకంపన తీవ్రత ఉన్నప్పటికీ.. అధికారులు ఆ ప్రాంతానికి ఎటువంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ఇంతలో మరేవైనా ప్రకంపనలు లేదా తదుపరి పరిణామాల కోసం అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. భయంతో జనాలు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు పెట్టినట్లుగా సమాచారం అందుతోంది. భూకంపం సున్నితమైన జోన్‌లో సంభవించడంతో తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్ట వివరాలు వెల్లడించలేదు.

  మార్చి 21న ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.9 తీవ్రతతో భూమి వణికింది. ఇది 160 కి.మీ లోతులో సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. ఇండోనేషియాలో కూడా ఇటీవల మరోసారి భూమి షేక్ అయింది. ఇండోనేషియాలోని మసోహికి ఉత్తర-వాయువ్య దిశలో 6 తీవ్రతతో భూకంపం సంభవించింది. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) ప్రకారం.. మసోహికి ఉత్తర-వాయువ్య దిశలో 5.32 UTC వద్ద 132 కి.మీ దూరంలో భారీ భూకంపం సంభవించింది. భూమి ఉపరితలం క్రింద 32 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని ఏజెన్సీ పేర్కొంది.  

Tags:    

Similar News