North China: ఆసియాలోనే అతిపెద్ద నేచురల్ సైన్స్‌ మ్యూజియం

పురాతన పక్షులు, జంతువులు, పలు డైనోసార్‌ జాతుల అస్థిపంజరాలతో ...;

Update: 2024-01-06 01:15 GMT

ఆసియాలోనే అతిపెద్ద నేచురల్ సైన్స్‌ మ్యూజియం చైనాలో ప్రారంభమైంది. పురాతన పక్షులు, జంతువులు, పలు డైనోసార్‌ జాతుల అస్థిపంజరాలను నిర్వాహకులు ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అరుదుగా లభించే పలు జీవాల ఎముకలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ప్రకృతి, మనుషులకు మధ్య సంబంధాన్ని తెలిపే ఇతివృత్తంతో ఏర్పాటైన ఈ మ్యూజియం సందర్శకులను కట్టిపడేస్తోంది.


ఇక్కడ కనిపిస్తున్న ఈ మ్యూజియం ఉత్తర చైనాలోని హెబీ ప్రావిన్స్‌లో ఉంది. ఈ సంగ్రహాలయం 73 వేల చదరపు మీటర్ల విస్త్రీర్ణంలో నిర్మితమైంది. బుధవారం నుంచి సందర్శకుల కోసం అందుబాటులోకి వచ్చిన ఈ మ్యూజియంలో 6 వేలకు పైగా పురాతన జీవాల అస్థిపంజరాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఇందులో ఉన్న చైనీస్ వెలోసిరాప్టర్ వీక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. డైనోసార్ జాతికి చెందిన ఈ జీవానికి సంబంధించి పూర్తి అస్థపంజరం ఇక్కడ ఉంది. ప్రపంచంలో మరెక్కడా పూర్తి సహజ ఎముకలతో ఉన్న వెలోసిరాప్టర్ అస్థిపంజరం మరొకటి లేదని నిర్వాహకులు తెలిపారు.


నేచురల్‌ సైన్స్‌ రంగంలో చైనా జాతీయ స్థాయి థీమ్ మ్యూజియంగా ఇది నిలుస్తుందని అక్కడి నిర్వాహకులు తెలిపారు. ఈ మ్యూజియం ప్రకృతి, మనుషులకు మధ్య సంబంధాన్ని తెలిపే ఇతివృత్తంతో ఏర్పాటైందని చెప్పారు. ఈ మ్యూజియంలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన ముఖం గల గుర్రం, సంరక్షించిన టెరోసార్ గుడ్లు ఉన్నాయి. మానవ శరీరంలో వచ్చిన మార్పులను తెలిపే అస్థిపంజరాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.

Tags:    

Similar News