World Lion Day: దేశంలో సింహాల సంఖ్య పెరుగుతోంది

నేడు అంతర్జాతీయ సింహాల దినోత్సవం

Update: 2023-08-10 05:30 GMT

అడవికి రాజు సింహమే.. కానీ ఇప్పుడు అవి అంతరించిపోయే జాతుల జాబితాలోకి చేరే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆగష్టు 10 వ తేదీన ప్రపంచ లయన్ డే గా జరుపుకుంటాం. తద్వారా అంతరించిపోతున్న సింహం భద్రత కాపాడుకుంటాం. ఈ సందర్భంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు చేశారు. ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా సింహాల ఆవాసాలను రక్షించేందుకు కృషి చేస్తున్న వారందరి అంకితభావాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఆసియాటిక్ సింహాలకు నిలయంగా ఉన్నందుకు భారతదేశం గర్విస్తోందని పేర్కొన్నారు

ప్ర‌పంచ సింహ‌ల దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. తమ శక్తి, గాంభీర్యంతో మన హృదయాలను దోచుకునే గంభీరమైన సింహాలను తలచుకుందాం అన్నారు. భారతదేశం ఆసియాటిక్ సింహానికి నిలయంగా ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. ప్రపంచంతో పోలిస్తే గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో సింహాల జనాభా స్థిరంగా పెరుగుతోంది. సింహాల ఆవాసాలను కాపాడేందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేసారు..


30 లక్షల సంవత్సరాల కిందట యూరప్-ఆసియా సింహాల అడ్డాగా ఉండేది. కాల క్రమంలో సింహాలు ఆఫ్రికాకి పరిమితం అయ్యాయి. మిగతా ప్రాంతాల్లో వీటి సంఖ్య అతి తక్కువగా ఉంది. ప్రస్తుతం భూమిపై మొత్తం సింహాల సంఖ్య 20 వేల లోపే ఉంటుందని అంచనా. వీటిలో ఇండియాలో ఉన్నవి 674 దాకా ఉన్నాయని అంచనా. అందువల్ల ఇవి అంతరించిపోయే జాతుల్లో చేరిపోయాయి. ఆఫ్రికాలో ట్రోఫీ హంటర్లు చాలా వన్యప్రాణుల లాగానే సింహాలనూ వేటాడి చంపేస్తున్నారు. సాధారణ వేటగాళ్లు కూడా వాటి ప్రాణాలు తీస్తున్నారు. కొన్ని సింహాలు ఆహారం దొరకక చనిపోతున్నాయి. ఇలా గత 40 ఏళ్లలో సింహాల సంఖ్య 50 శాతం తగ్గిపోయింది.

ఇక కెన్యాలోని జాతీయ పార్కుల్లో అయితే సింహాల ఉనికి ప్రమాదంలో చిక్కుకుంది. తగ్గిపోతున్న పర్యావరణ వ్యవస్థ, మానవులతో జరిగే సంఘర్షణలతో సింహాలకు ప్రమాదం పొంచి ఉంది. అదే సమయంలో కార్చిచ్చులు, వాతావరణ మార్పులూ సింహాల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. మరో వైపు మానవులు సింహాల మధ్య వనరుల కోసం నిత్యం ఆధిపత్య పోరు జరుగుతోంది. కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్‌లో ఈ ఏడాది మేలో ఒకే వారంలో 10 సింహాల మృతి మానవ-వన్యప్రాణుల సంఘర్షణను మరోసారి రుజువు చేస్తోంది.

వందేళ్ల క్రితం ఆఫ్రికా ఖండంలో సుమారు 2 లక్షలు వరకు ఉన్న సింహాల జనాభా ప్రస్తుతం 24వేలకు పడిపోయింది.కెన్యాలో 2,500 సింహాలు మాత్రమే ఉన్నాయి. అప్పటితో పోల్చుకుంటే ఆఫ్రికాలో సింహాలు సుమారు 90 శాతం వాటి భూభాగాలను కోల్పోయాయి. ఇప్పటికైనా మనం మేలుకోకపోతే సింహాలంటే ఇలా ఉంటాయని చిత్రాలలో చూసి మన భావితరాలు తెలుసుకునే రోజులు రావచ్చు..

Tags:    

Similar News