Bangladesh: భారత్‌తో మా సంబంధాలు బలంగానే ఉన్నాయి: బంగ్లాదేశ్
విభేదాలు వచ్చి పోయే మేఘాల్లాంటివి- మహమ్మద్ యూనస్;
భారత్- బంగ్లాదేశ్ ల మధ్య సంబంధాలు బలంగానే ఉన్నట్లు ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు దిగజారినట్లు ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలంగానే ఉన్నట్లు చెప్పారు.
బంగ్లాదేశ్-భారత్ మధ్య బంధం సన్నిహితంగానే ఉన్నట్లు తెలిపారు. అయితే, ఇటీవలే కొన్ని విభేదాలు తలెత్తినట్లు చెప్పారు. అవి వచ్చిపోయే మేఘాల్లాంటివిగా అభివర్ణించారు. తప్పుడు సమాచారం, దుష్ప్రచారాలే ఈ ఘర్షణలకు కారణమని పేర్కొన్నారు. వీటిని తొలగించి.. ఇరు దేశాల మధ్య సహకారాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు. తమ అధికారులు భారత్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు.
బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో గతేడాది ఆగస్టు 5న ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ క్రమంలోనే అక్కడున్న హిందూ మైనార్టీలపై దాడులు జరిగాయి. దీనిపై భారత్ ఎప్పటికప్పుడు తన ఆందోళనను వ్యక్తంచేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇరుదేశాల మధ్య సంబంధాలు బలహీనపడ్డాయి. అయితే, భారత్- బంగ్లాల మధ్య సత్సంబంధాలను కొనసాగించాలని భావిస్తున్నట్లు ఇరుదేశాలు పేర్కొంటూ వస్తున్నాయి.
ఇదిలాఉండగా.. భారత్‌లో ఉన్న హసీనాపై బంగ్లాదేశ్‌కు చెందిన అంతర్జాతీయ క్రైమ్ ట్రైబ్యునల్ గతంలో అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో ఆమెను తిరిగి రప్పించేందుకు అక్కడి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమెతోపాటు పలువురు మాజీ క్యాబినెట్ మంత్రులు, సలహాదారులు, మిలిటరీ అధికారులపైనా అరెస్టు వారెంట్‌లు జారీ అయ్యాయి. మరోవైపు.. దేశాన్ని అస్థిరపరిచే కుట్రదారులను, చట్ట ఉల్లంఘనలకు పాల్పడేవారే లక్ష్యంగా యూనస్ సర్కారు ‘ఆపరేషన్ డెవిల్ హంట్’ను చేపట్టింది.