పశ్చిమాసియా దేశమైన సిరియాలో అసద్ శకం ముగిసింది. దేశం తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లింది. ఆదివారం రాజధాని డమాస్కస్‌ను రెబల్స్ ఆక్రమించుకోవడంతో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోయారు. ఆయన ఆచూకీ తెలియడం లేదు. అయితే అసద్ పారిపోతున్న విమానాన్ని రెబల్స్ కూల్చివేసినట్టు సామాజిక మాధ్యమంలో ప్రచారం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న ఐఎల్ 76 విమానాన్ని లెబనాన్ గగనతల పరిధిలో కూల్చివేసినట్టు పేర్కొంటున్నా, దానిని అధికారికంగా ఎవరూ ధ్రువీకరించ లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తన పూర్తి సహకారం అందిస్తానని సిరియా ప్రధాని మహమ్మద్ ఘాజీ-జలాలి ప్రకటించారు. ‘ఈ చీకటి కాలానికి ముగింపు పలుకుతున్నాం.. సిరియాలొ కొత్త శకం ప్రారంభమైంది.
విదేశాల్లో ఉన్న సిరియన్లు స్వేచ్ఛగా రావచ్చు’ అని తిరుగుబాటుదారులు ప్రకటించారు. 55 ఏండ్ల అసద్ కుటుంబ పాలన ముగియడంతో పౌరులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. అధ్యక్షుడు బషర్ అసద్ పదవీచ్యుతుడయ్యారని, ఖైదీలను విడుదల చేస్తున్నామని కొంతమంది వీడియో ప్రకటన విడుదల చేసినట్టు సిరియన్ స్టేట్ టెలివిజన్ తెలిపింది. తర్వాత కొద్ది సేపటికి అసద్ దేశాన్ని వదిలి గుర్తు తెలియని ప్రదేశానికి పారిపోయారని ప్రకటించింది. ఇప్పటివరకు సిరియాకు సహాయం అందించిన రష్యా.. ఉక్రెయిన్ యుద్ధంతో తలమునకలై ఉండటం, ఇరాన్, హెజ్బొల్లాలు కూడా ఇజ్రాయెల్‌తో తలపడుతూ ఉండటం వల్ల సిరియాను పట్టించుకునే వారే కరవయ్యారు. దీంతో ఇదే అదనుగా ఇటీవల తిరుగుబాటుదారులు మళ్లీ విజృంభించడం ప్రారంభించారు. అబు మహ్మద్ అల్ జులానీ నేతృత్వంలోని హయాత్ తహరీర్ అల్ షమ్ (హెచ్‌టీఎస్) ఇటీవల తిరిగి తిరుగుబాటు ప్రారంభించి అసద్ పాలనకు ముగింపపు పలికింది.
అంతర్యుద్ధం ఉన్నా, 14 ఏండ్ల పాటు నిరంకుశ పాలన సాగించిన అసద్ పదవి నుంచి దిగిపోయిన విషయాన్ని ప్రజలు తొలుత నమ్మలేకపోయారు. కొద్ది సేపటికి రాజధాని అంతటా సంబరాలతో నిండిపోయింది. మసీదులలో ప్రార్థనలతో పాటు, ఉమయ్యద్ స్క్వేర్‌లో వేలాది మంది సంబరాలు జరుపుకున్నారు. అసద్ వ్యతిరేక నినాదాలు చేస్తూ, జాతీయ జెండాలు చేతబట్టి సంబరాలు చేసుకున్నారు. కొందరు అధ్యక్షుడి భవనంలోకి ప్రవేశించి ఖరీదైన సామగ్రిని అపహరించుకుపోయారు. అసద్ తండ్రి విగ్రహంతో పాటు ఆస్తులు, అధికార చిహ్నాలను వారు ధ్వంసం చేశారు.
14 ఏండ్ల పాటు నిరంకుశ పాలన
సిరియా అధ్యక్షుడు అసద్ వృత్తి రీత్యా డాక్టర్. ఆయనకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదు. ఆయన పెద్ద సోదరుడు బషీర్ రాజకీయ వారసుడిగా కొనసాగుతారని అనుకున్నారు. అయితే 1994లో ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అసద్ స్వదేశానికి వచ్చారు. 2000లో ఆయన తండ్రి హఫెజ్ అల్ అసద్ మరణించడంతో అసద్‌ను అధ్యక్షుడిగా ప్రకటించారు. వాస్తవానికి అధ్యక్షుడిగా ఎంపికవ్వడానికి 40 ఏళ్ల వయసుండాలి. అయితే అసద్‌కు అప్పటికీ 34 ఏండ్లే కావడంతో చట్టాన్ని సడలించారు. అసద్‌కు 2011 మార్చి నుంచి దేశంలో వ్యతిరేకత ప్రారంభమైంది. దీంతో అసమ్మతి గళాలను అణచివేయడానికి ఆయన తండ్రి బాటలో క్రూరమైన విధానాలను అనుసరించారు. ఇది అంతర్యుద్ధానికి దారితీసింది. సిరియా ప్రభుత్వంలో పౌరులపై జరుగుతున్న హింస, చట్టవిరుద్ధ హత్యలు, ప్రభుత్వం నిర్వహిస్తున్న నిర్బంధ కేంద్రాలపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. యుద్ధం కారణంగా ఐదు లక్షల మంది మరణించగా, 23 మిలియన్ల జనాభాలో సగం మంది నిరాశ్రయులయ్యారు.