Biden Vs Trump: మళ్లీ బైడెన్ x ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో రెండోసారి;
అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో మళ్లీ పాత ప్రత్యర్థులే తలపడనున్నారు. డెమొక్రటిక్ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. . జార్జియా, హవాయి, మిస్సిస్సిప్పి, వాషింగ్టన్‌లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిత్వానికి అవసరమైన మద్దతును బైడెన్ కూడగట్టుకున్నారు. ఇక, ట్రంప్ కూడా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వానికి కావాల్సిన ప్రతినిధుల మద్దతును ఇప్పటికే దక్కించుకున్నారు.
త్వరలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య పోరు ఖాయమైంది. తాజాగా జరిగిన జార్జియా ప్రైమరీలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విజయం సాధించారు. దీంతో డెమొక్రటిక్ పార్టీ నుంచి అభ్యర్థిత్వానికి నామినేట్ కావడానికి అవసరమైన 1,968 మంది ప్రతినిధులను సంపాదించుకున్నారు. ఆగస్టులో షికాగోలో జరగనున్న డెమొక్రటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్‌లో బైడెన్ నామినేషన్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. అలాగే రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వం సైతం ఖరారైంది. తాజాగా వాషింగ్టన్ ప్రైమరీలో విజయం సాధించారు. దీంతో నామినేషన్‌కు కావాల్సిన 1215 ప్రతినిధుల ఓట్లను కైవసం చేసుకున్నారు డొనాల్డ్ ట్రంప్. జులైలో మిలావాకీలో జరగనున్న రిపబ్లికన్ పార్టీ నేషనల్ కన్వెన్షన్‌లో ట్రంప్ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తారు.
జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ తమ పార్టీల తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండో సారి తలపడనుండడం ఆసక్తికరంగా మారింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో రీమ్యాచ్ జరగడం (వరుసగా రెండు సార్లు ఒకే అభ్యర్థులు పోటీ చేయడం) రెండోసారి. 2020 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ల తరఫున జో బైడెన్ పోటీ పడ్డారు. 2024 నవంబరులో జరిగే పోరుకు కూడా వీరిద్దరి అభ్యర్థిత్వమే ఖరారైంది.
అంతకుముందు 1952 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున డ్వైట్ డీజిన్హవర్, డెమొక్రాట్ల తరఫున అడ్లై స్టీవెన్సన్-2 పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో డీజిన్హవర్ భారీ విజయం సాధించారు. మళ్లీ 1956లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వీరిద్దరే ప్రత్యర్థులగా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో కూడా రిపబ్లికన్ అభ్యర్థి డీజిన్హవర్ గెలుపొందారు. మరి 2024లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, బైడెన్ ఇద్దరిలో ఎవరిని విజయం వరిస్తుందో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు నిక్కీ హేలీ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్‌నకు అభినందనలు తెలిపిన హేలీ, అందరి ఓట్లు సంపాదించేలా చూసుకోవాలని ఆయనకు సలహా ఇచ్చారు.