Canada: వలసదారులకు మార్గం సుగమం చేస్తున్న కెనడా
జనాభా పెరిగితే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతామన్న యోచనలో ట్రూడో;
వచ్చే ఏడాదికి కెనడా ఆర్ధిక మాంద్యంలోకి జారిపోనుంది. తద్వారా ఆర్ధిక వ్యవస్థ మరింత కుంటుపడనుంది. ఇప్పటికే వడ్డీ రేట్ల పెంపు, డాలర్ విలువ మరింత పడిపోవడంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆందోళనకు గురవుతున్నారు. ఈ తరుణంలో దేశ ఎకానమీకి ఊతం ఇచ్చేలా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంతో భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన పౌరులకు భారీ ఊరట కలగనుంది. జాతీయ ఉత్పాదకతను పెంచే చర్యల్లో భాగంగా వలసదారులకు ద్వారాలు తెరవాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే సరైన పత్రాలు లేకుండా దేశంలో ఉన్నవారికి ఊరట కలిగించాలని భావిస్తోంది.
2025 నాటికి దేశంలో మొత్తం 5 లక్షల మంది వలసదారులు ఉండేలా కెనడా కార్యాచరణ రూపొందించింది. 2023లో దేశంలో వలసదారుల సంఖ్య 4.65 లక్షలు, 2024లో 4.85 లక్షలు, 2025 నాటికి 5 లక్షలు ఉండేలా ఈ కార్యాచరణ సిద్ధం చేశారు. దీనిపై కెనడా వలసలు, శరణార్థులు, పౌరసత్వం శాఖ మంత్రి మార్క్ మిల్లర్ స్పందించారు. దేశంలో జనాభా పెరగడం ద్వారా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇప్పటికే సరైన పత్రాలు లేకుండా కెనడాలో నివసిస్తున్న వలసదారులకు పౌరసత్వం ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమం తీసుకువస్తున్నట్టు చెప్పారు.
కెనడాలో ఇప్పటికిప్పుడు సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న వలసదారులు 3 లక్షల నుంచి 6 లక్షల వరకు ఉంటారని అంచనా. నిర్దేశిత సమయం లోపు వారు పత్రాలను కెనడా ప్రభుత్వానికి సమర్పించకపోతే వారిని స్వదేశాలకు తిప్పి పంపుతారు. కెనడా ప్రభుత్వం తీసుకువస్తున్న తాజా విధానం ఇలాంటి వారికి ఉపయోగకరంగా ఉండనుంది. ఆ మేరకు వీసా నిబంధనలు సవరించనున్నారు. అయితే, సరైన పత్రాలు లేకుండా ఇటీవల కెనడాలో ప్రవేశించిన వలసదారులకు నూతన విధానంతో ఎలాంటి ప్రయోజనం దక్కదు.