China Nuclear Test: గల్వాన్ ఘర్షణల తర్వాతే చైనా అణుపరీక్ష.. అమెరికా ఆరోపణ

ఆరోపణలను తీవ్రంగా ఖండించిన చైనా, అంతర్జాతీయ సంస్థ

Update: 2026-02-08 04:00 GMT

చైనా 2020లో రహస్యంగా అణుపరీక్ష నిర్వహించిందని అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. భారత్‌తో గల్వాన్ లోయలో ఘర్షణలు జరిగిన సరిగ్గా వారం రోజుల తర్వాత, జూన్ 22, 2020న ఈ పరీక్ష జరిగిందని తొలిసారిగా బహిరంగంగా వెల్లడించింది. అయితే, ఈ ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించగా, అంతర్జాతీయ అణుపరీక్షల పర్యవేక్షణ సంస్థ (CTBTO) కూడా అమెరికా వాదనకు విరుద్ధమైన ప్రకటన చేసింది.

స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగిన నిరాయుధీకరణ సదస్సులో అమెరికా అండర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ థామస్ డినాన్నో శుక్రవారం ఈ ఆరోపణలు చేశారు. "చైనా అణు విస్ఫోటన పరీక్షలు నిర్వహించినట్లు అమెరికా ప్రభుత్వానికి తెలుసు. ప్రపంచం నుంచి తన కార్యకలాపాలను దాచిపెట్టడానికి 'డీకప్లింగ్' అనే సాంకేతికతను చైనా ఉపయోగించింది. 2020 జూన్ 22న అలాంటి ఒక పరీక్షను జరిపింది" అని ఆయన తెలిపారు. భూగర్భంలో పెద్ద ఖాళీ ప్రదేశంలో అణుపరీక్ష జరపడం ద్వారా భూకంప తరంగాలను తగ్గించి, పసిగట్టకుండా చేయడాన్నే డీకప్లింగ్ అంటారు.

అమెరికా, రష్యా మధ్య కీలకమైన 'న్యూ స్టార్ట్' అణు ఒప్పందం ఇటీవల ముగిసిన నేపథ్యంలో ఈ ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భవిష్యత్తులో అణ్వస్త్ర నియంత్రణ ఒప్పందాల్లో చైనాను కూడా భాగం చేయాలని అమెరికా భావిస్తోంది. ఈ క్రమంలోనే ఒత్తిడి పెంచేందుకు ఈ ఆరోపణలు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

అమెరికా ఆరోపణలపై చైనా తీవ్రంగా స్పందించింది. ఇవన్నీ నిరాధారమైన కథనాలని, ఆయుధ పోటీని పెంచుతున్నది అమెరికానే అని చైనా రాయబారి షెన్ జియాన్ విమర్శించారు. మరోవైపు, అణుపరీక్షలను పర్యవేక్షించే అంతర్జాతీయ సంస్థ సీటీబీటీవో కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. 2020 జూన్ 22న చైనాలో అణుపరీక్షకు సంబంధించిన ఎలాంటి కార్యకలాపాలను తమ వ్యవస్థలు గుర్తించలేదని స్పష్టం చేసింది. దీంతో ఈ వివాదం మరింత సంక్లిష్టంగా మారింది.

Tags:    

Similar News