China ETIM threat: చైనాను భయపెడుతున్న ఉగ్రసంస్థ.

తూర్పు తుర్కిస్థాన్ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థపై వెంటనే చర్యలు తీసుకోవాలని చైనా డిమాండ్;

Update: 2025-08-22 01:45 GMT

 చైనాను ఓ ఉగ్రవాద సంస్థ భయపెడుతుంది. అగ్రరాజ్యం అమెరికాను దాటి ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించాలని చూస్తున్న డ్రాగన్ దేశానికి ఓ ఉగ్రవాద సంస్థ కంట్లో నలుసులా మారింది. బుధవారం జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో తూర్పు తుర్కిస్థాన్ ఇస్లామిక్ ఉద్యమం అనే ఉగ్రవాద సంస్థపై వెంటనే చర్యలు తీసుకోవాలని చైనా డిమాండ్ చేసింది. ఓ అంతర్జాతీయ పత్రిక కథనం ప్రకారం.. ఐక్యరాజ్యసమితిలో చైనా డిప్యూటీ శాశ్వత ప్రతినిధి జెంగ్ షువాంగ్ మాట్లాడుతూ.. తూర్పు తుర్కిస్థాన్ ఇస్లామిక్ ఉద్యమానికి చెందిన వేలాది మంది ఉగ్రవాదులు మళ్లీ సిరియాలో చురుకుగా మారారని అన్నారు. వాళ్లందరూ సిరియాలో బలం పెంచుకొని తమ పరిసరాల్లో భయాన్ని వ్యాపింపజేస్తున్నారని అన్నారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే పరిస్థితి మరింత దిగజారిపోతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఉగ్రవాద సంస్థను ఆపకపోతే మధ్యప్రాచ్యం నుంచి దక్షిణాసియా వరకు ఉన్న దేశాలు నాశనం అవుతాయని హెచ్చరించారు.

ఏంటీ తూర్పు తుర్కిస్థాన్ ఇస్లామిక్ ఉద్యమం?

1990లో పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్‌లో హసన్ మహ్మూన్ ఈ తూర్పు తుర్కిస్థాన్ ఇస్లామిక్ ఉద్యమాన్ని స్థాపించారు. ఈ ఉగ్రవాద సంస్థ అంతిమ లక్ష్యం తుర్కిస్థాన్ అనే ప్రత్యేక దేశాన్ని సృష్టించడం. విదేశీ సంబంధాల మండలి నివేదికల ప్రకారం.. చైనాలోని ఉయ్ఘర్‌లకు ప్రత్యేక దేశం ఏర్పాటుకు సహాయం చేయడానికి ఈ ఉగ్రవాద సంస్థ ఆవిర్భవించిందని పేర్కొన్నాయి. ప్రారంభంలో ఈ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా నుంచి నిధులు పొందేది. 2002లో ప్రపంచం ఈ ఉగ్రవాద సంస్థపై నిషేధం విధించడం ప్రారంభించింది. 2003లో పాకిస్థాన్ సహాయంతో చైనా ఈ ఉగ్రసంస్థ

వ్యవస్థాపకుడు హసన్ మహమూన్‌ను చంపింది. తర్వాత 2010లో మహమూన్ వారసుడు అబ్దుల్ హక్‌ను కూడా చంపింది. దీని తర్వాత ఈ సంస్థ తెరవెనుక నుంచి కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించింది. నాటి నుంచి ఈ ఉగ్రసంస్థ అధినాయకుడు ఎవరో ప్రపంచానికి తెలియదు.

ఇప్పటికే చైనాలో ప్రకంపనలు..

చైనాలో 2008 నుంచి 2014 వరకు ఈ ఉగ్రవాద సంస్థ వరుసగా 8 ప్రధాన దాడులను నిర్వహించింది. వీటిలో కాష్గర్ దాడి, బీజింగ్ ఒలింపిక్స్‌కు ముందు దాడి, ఉరుంకి అల్లర్లు, కున్మింగ్ రైల్వే స్టేషన్ దాడి ఉన్నాయి. ఈ దాడుల్లో కనీసం 260 మంది చైనీయులు మరణించగా, 500 మందికి పైగా గాయపడ్డారని పలు నివేదికలు తెలిపాయి. ఆ సమయంలో ఈ దాడులు చైనాలో ప్రకంపనలు సృష్టించాయి. దీని తరువాత చైనా ఉయ్ఘర్ ముస్లింలను నేరుగా తన రాడార్‌లో ఉంచడం ప్రారంభించింది. సిరియాలో తిరుగుబాటు తర్వాత, తూర్పు తుర్కిస్థాన్ ఇస్లామిక్ ఉద్యమ ఉగ్రవాదులు చురుకుగా మారారని జెంగ్ అన్నారు. 2020 డేటా ప్రకారం.. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్‌లో 1.7 కోట్ల మంది ఉయ్ఘర్లు ఉన్నారు. అదే సమయంలో సుమారుగా 15 లక్షల మంది ఉయ్ఘర్ ముస్లింలు చైనా పొరుగు ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇక్కడ తిరుగుబాటు జరిగితే అది చైనాకు పెద్ద ముప్పుగా పరిణమిస్తుంది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ జిన్‌జియాంగ్ ప్రావిన్స్ గుండా వెళ్తూ.. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లను చేరుకుంటుంది. ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారితే ఈ ప్రాజెక్ట్ ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News