China: అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నా దేశాలకు చైనా సీరియస్ వార్నింగ్
అమెరికా, చైనాల మధ్య ముదురుతున్న ట్రేడ్ వార్;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 2న భారత్ సహా అనేక దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించారు. అయితే, వాణిజ్య చర్చల కోసం వాటిని 90 రోజుల పాటు నిలిపివేస్తూ నిర్ణయం ప్రకటించారు. చైనాకు మాత్రం ఎలాంటి మినహాయింపులూ ఇవ్వలేదు. దీంతో ప్రభావిత దేశాలు అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నాయి . ఈ సుంకాల నుంచి మినహాయింపులు పొందాలంటే చైనాతో ఉన్న ఆర్థిక సంబంధాలను విరమించాల్సిందిగా ట్రంప్ సర్కార్ కొన్ని మిత్రదేశాలకు స్పష్టంగా సూచించినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ వార్తలపై చైనా తీవ్రంగా స్పందించింది. తమ దేశ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటే ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించింది.
‘అమెరికాతో ఒప్పందాలు చేసుకునే సందర్భంలో వాటి ప్రభావం చైనా ప్రజల ప్రయోజనాలను దెబ్బతీయగలదనుకుంటే అలాంటి ఒప్పందాలను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అలాంటి పరిస్థితి ఎదురైతే దాన్ని మేం ఎప్పటికీ అంగీకరించం. మా నుంచి వచ్చే ప్రతిస్పందన కూడా అదే స్థాయిలో ఉంటుంది. బుజ్జగింపులతో శాంతి స్థాపన జరగదు. రాజీ పడితే గౌరవం లభించదు. తక్షణ లాభాల కోసం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో తీవ్రమైన నష్టాలను కలిగించే అవకాశం ఉందన్న విషయాన్ని దేశాలు గుర్తించుకోవాలి’ అని పేర్కొంది. ఈ మేరకు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. చైనా ఉత్పత్తులపై అమెరికా టారిఫ్‌లు 245 శాతానికి పెరిగిన విషయం తెలిసిందే.