Tiangong Space Station: తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు - చైనా కీలక ఆపరేషన్

అంతరిక్షంలో ఉన్న వ్యోమగాముల కోసం బ్యాకప్ వాహనంగా ఏర్పాటు

Update: 2025-11-26 02:30 GMT

చైనా తన అంతరిక్ష కార్యక్రమంలో భాగంగా మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. తమ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్‌లో చిక్కుకున్న ముగ్గురు వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకురావడమే లక్ష్యంగా 'షెంజౌ 22' అనే అంతరిక్ష నౌకను నిన్న నింగిలోకి పంపింది. ఈ నౌక విజయవంతంగా అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది.

ప్రస్తుతం తియాంగాంగ్ స్పేస్ స్టేషన్‌లో ముగ్గురు వ్యోమగాములు ఉన్నారు. వీరు నవంబర్ 1న అక్కడికి చేరుకున్నారు. అయితే, అంతకుముందు వెళ్లిన 'షెంజౌ 20' మిషన్ సిబ్బంది ఉపయోగించాల్సిన స్పేస్‌క్రాఫ్ట్ కిటికీ దెబ్బతింది. దీంతో వారి తిరుగు ప్రయాణం తొమ్మిది రోజుల పాటు ఆలస్యమైంది. అప్పటికే కొత్త సిబ్బందిని తీసుకెళ్లిన 'షెంజౌ 21' నౌకలో పాత సిబ్బంది భూమికి తిరిగి వచ్చారు. ఈ పరిణామంతో, స్పేస్ స్టేషన్‌లో ఉన్న కొత్త సిబ్బందికి అత్యవసర పరిస్థితుల్లో తిరిగి రావడానికి ఒక నమ్మకమైన వాహనం లేకుండా పోయింది.

ఈ నేపథ్యంలోనే చైనా అంతరిక్ష సంస్థ తక్షణ చర్యలు చేపట్టింది. వ్యోమగాముల భద్రతకు పెద్దపీట వేస్తూ షెంజౌ 22 నౌకను బ్యాకప్‌గా పంపింది. 2026లో ప్రస్తుత సిబ్బంది ఈ నౌక ద్వారానే భూమికి తిరిగి రానున్నారు. ఇక దెబ్బతిన్న షెంజౌ 20 నౌకను తరువాత భూమిపైకి తీసుకొచ్చి, దాని వైఫల్యంపై విశ్లేషణ జరుపుతామని చైనా అధికారిక మీడియా వెల్లడించింది.

అమెరికా భద్రతా కారణాలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) ప్రాజెక్టు నుంచి చైనాను మినహాయించడంతో, ఆ దేశం సొంతంగా 'తియాంగాంగ్' (స్వర్గపుర సౌధం) పేరుతో స్పేస్ స్టేషన్‌ను నిర్మించుకుంది. 2021 నుంచి ఇక్కడ వ్యోమగాములు నిరంతరం మిషన్లు చేపడుతున్నారు.

Tags:    

Similar News