Chinas Spy Ship: భారత్‌ సమీపంలో చైనా గూఢచారి నౌక.

పాకిస్థాన్‌కు సాయం కోసమేనా..?;

Update: 2025-05-17 01:30 GMT

ఆపరేషన్ సిందూర్ తర్వాత.. చైనా తన గూఢచారి నౌకను భారత జలాల దగ్గరగా పంపింది. ఈ ఓడ పేరు డా యాంగ్ యి హావో. దాని కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ.. చైనా దీనిని సముద్ర సర్వే నౌక అని చెబుతోంది. ఈ నౌక కదలికలపై అమెరికాతో సహా అనేక దేశాలు అనుమానం వ్యక్తం చేశాయి. సర్వే నౌకల సహాయంతో చైనా శత్రు దేశాలపై గూఢచర్యం చేస్తుందని స్పష్టంగా చెబుతున్నాయి. పాకిస్థాన్‌తో ఉద్రిక్తత మధ్య చైనా గూఢచారి నౌక భారత సముద్ర సరిహద్దుకు దగ్గరగా రావడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ (OSINT) ప్రకారం.. చైనా భూగర్భ శాస్త్రం, భౌగోళిక భౌతిక సర్వే నౌక డా యాంగ్ యి హావో – సముద్రగర్భాన్ని మ్యాప్ చేయగలదు. సబ్మెర్సిబుల్‌ను మోసుకెళ్లగల సామర్థ్యం ఉంది. తాజాగా ఈ నౌక హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి ప్రవేశించింది. ఆ నౌక మే 12-13 తేదీల మధ్య అండమాన్, నికోబార్ దీవులను దాటి హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి చేరుకుంది. మే 14న, ఇది భారతదేశానికి ఆగ్నేయంగా హిందూ మహాసముద్రంలో కనిపించింది. అప్పటి నుండి ఓడ దాని ట్రాన్స్‌పాండర్‌ను ఆపివేయడం వలన దాని స్థానాన్ని ట్రాక్ చేయడం కష్టమైంది.

పాకిస్థాన్‌కు చైనా ఎలా సహాయం చేయగలదు?

చైనా తన గూఢచారి నౌకల సహాయంతో భారత జలాల్లో జలాంతర్గాముల కార్యకలాపాలను ట్రాక్ చేయగలదు. ఆ గూఢచారి నౌకకు ఉన్న అధునాతన సెన్సర్లతో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ సహా భారత యుద్ధ నౌకల కదలికలను పసిగట్టేందుకు వీలుంది. పాక్‌కు తమ మద్దతు ఉందని సంకేతాలు పంపేందుకు, నిఘా సమాచారాన్ని సేకరించేందుకు ఈ మోహరింపు ఉపయోగించుకొని ఉండొచ్చని అనుమానాలు. ఒకవేళ పాకిస్థాన్‌లోని కరాచీపై భారత్‌ దాడి చేసేందుకు సన్నాహాలు చేస్తే, వాటిని ముందుగానే పసిగట్టి, సదరు సమాచారాన్ని పాకిస్థాన్‌కు తెలియజేసేలా ఈ మోహరింపు ఉండి ఉండొచ్చు.

చైనా ప్రతిష్ఠాత్మక బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇన్షియేటివ్‌ (బీఆర్‌ఐ) కింద చైనా-పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ నిర్మాణం జరుగుతోంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ మీదుగా సీపెక్‌ ప్రాజెక్టు చేపట్టడంపై భారత్‌ మొదట్నుంచీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేస్తోంది. ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కావాలంటే పాక్‌లో రాజకీయంగా, ఆర్థికంగా స్థిరమైన పరిస్థితులు ఉండటం డ్రాగన్‌కు అత్యంత కీలకం. అది కూడా నిఘా వెనక కారణం కావొచ్చు. భారతదేశంపై నిఘా ఉంచడంలో పాకిస్తాన్ నావికాదళానికి సహాయపడుతుంది. ఈ నౌక భారత నావికా దళాల మధ్య కమ్యూనికేషన్లను అడ్డుకోగలదు. భారతీయ కార్యాచరణ ప్రోటోకాల్‌లు, సంక్షోభ ప్రతిస్పందనలపై సమాచారాన్ని అందిస్తుంది.

Tags:    

Similar News