China : చైనా చేతిలో లేజర్ వెపన్
కూలింగ్ సిస్టమ్‌తో వేడి లేకుండానే శక్తిని విడుదల చేసే అస్త్రం
రక్షణరంగంలో కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకొంటున్న చైనా చేతికి సరికొత్త లేజర్ ఆయుధం వచ్చిచేరింది. శత్రు క్షిపణులను, రాకెట్లను, డ్రోన్లను లేజర్ కిరణాలతో కూల్చేయవచ్చు. అయితే, ఈ లేజర్ ఆయుధాలను కొంత సమయం పాటే వినియోగించి విశ్రాంతినివ్వాల్సి ఉంటుంది. అలాగే దాని నుంచి వచ్చే వేడి కూడా చాలా ఎక్కువ. దీంతో లేజర్ వ్యవస్థపై ఒత్తిడిపడి సాంకేతిక సమస్యలు తలెత్తవచ్చు. అయితే, వీటికి భిన్నంగా నిర్విరామంగా ఎంత దూరమైనా ప్రయాణించి లక్ష్యాలను ఛేదించే లైజర్ ఆయుధాన్ని చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
లేజర్ ఆయుధాలను ఇప్పటివరకూ కొంత దూరంలోని లక్ష్యాలను నాశనం చేయడానికి అదీ కొంత సమయంపాటే అంటే కొన్ని నిమిషాలలు మాత్రమే ప్రయోగిస్తున్నారు. అలాంటి సమస్యలకు చెక్ పెట్టేలా.. చైనాలో చెంగ్షూలోని ‘నేషనల్ డిఫెన్స్ టెక్నాలజీ’ శాస్త్రవేత్తలు స్వదేశీ పరిజ్ఞానంతో ‘సరికొత్త లేజర్ వెపన్’ను అభివృద్ధి చేశారు. ఎలాంటి ఉష్ణ సమస్యలు లేకుండానే ఈ లేజర్ ఆయుధం తన కిరణాలను ఎంతదూరమైనా నిరాటంకంగా ప్రసరింపజేయగలదు. అలాగే మెషిన్‌కు విశ్రాంతినివ్వాల్సిన పని కూడాలేదు. లేజర్ వ్యవస్థపై ఒత్తిడి పడకుండా శాస్త్రవేత్తలు ఇందులో ప్రత్యేక కూలింగ్ సిస్టవ్మ్ అభివృద్ధి చేశారు. ఈ కూలింగ్ సిస్టమ్ హైఎనర్జీ లేజర్ వేడెక్కకుండా అడ్డుకోవడంతోపాటు అవసరమైన శక్తిని అందిస్తుందని చెబుతున్నారు.
ఈ లేజర్ కిరణం రోదసిలోకి సైతం దూసుకెళ్లగలదని, అడ్డొచ్చిన ఏ వస్తువునైనా బూడిదగా మార్చేస్తుందని తెలుస్తోంది. దాంతో చైనా తన ప్రత్యర్థి దేశాల ఉపగ్రహాలను దెబ్బతీసి, ఆయా దేశాల కమ్యూనికేషన్ వ్యవస్థలను చాలా ఈజీ గా కుప్పకూల్చగలదు.
ఈ లేజర్ ఆయుధం, దాని కూలింగ్ టెక్నాలజీ విషయాలు వివరాలన్నీ ఇటీవల ఓ జర్నల్ లో ప్రచురితమవడంతో వెలుగులోకి వచ్చాయి. అయితే చైనా మాత్రం ఈ విషయాలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయడం కానీ, ఎక్కడా దాన్ని ప్రదర్శించడం కానీ చేయలేదు.