Boy Died: లావుగా ఉన్నాడని బలవంతంగా ట్రెడ్‌మిల్ వ్యాయామం
అమెరికాలో ఆరేళ్ల బాలుడి మృతి;
కుమారుడు లావుగా ఉన్నాడని భావించిన ఓ వ్యక్తి ట్రెడ్‌మిల్‌పై బలవంతంగా పరిగెత్తించి అతడి మరణానికి కారణమయ్యాడు. అమెరికాలో మూడేళ్ల క్రితం జరిగిన ఈ విషాదకర ఘటనకు సంబంధించిన దృశ్యాలు విచారణ సందర్భంగా వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు న్యూజెర్సీకి చెందిన క్రిస్టోఫర్ గ్రెగర్ 2021లో అరెస్టయ్యాడు. ఈ కేసుకు సంబంధించి తాజాగా కోర్టులో విచారణ జరగ్గా.. బాలుడి మృతికి కారణమైన ట్రెడ్‌మిల్ పరుగు దృశ్యాలను సాక్ష్యాలుగా న్యాయస్థానంలో ప్రదర్శించారు.
మూడేళ్ళ క్రితం మార్చి 20న క్రిస్టోఫర్ తన కుమారుడు కోరీని స్థానికంగా ఉన్న ఓ ఫిట్‌నెస్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. బాలుడిని ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తించాడు. అతడికి కష్టంగా అనిపిస్తున్నా సరే వేగాన్ని చాలా పెంచాడు. దీంతో ఆ బాలుడు పలుమార్లు కిందపడ్డాడు. అయినప్పటికీ ఆగకుండా మళ్లీ ట్రెడ్‌మిల్ ఎక్కించాడు. మారాంచేస్తే కొట్టాడు. కొన్ని రోజులకు తీవ్ర అనారోగ్యానికి గురవడంతో 2021 ఏప్రిల్ 1న బాలుడిని తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ మరుసటిరోజే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అతడి అంతర్గత అవయవాలకు తీవ్ర గాయాలైనట్లు స్కానింగ్‌లో తేలింది. గుండె, కాలేయంపై తీవ్ర ప్రభావం పడడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల కారణంగా అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అదే ఏడాది జూలైలో క్రిస్టోఫర్ ను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో ఇందుకు సంబంధించి దృశ్యలు చూసి బాలుడి తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ కేసులో అతను జీవిత ఖైదు అనుభవించే అవకాశం ఉంది.