Dalai Lama: ఎప్ స్టీన్ ఫైల్స్ లో 169 సార్లు పేరు.. వివరణ ఇచ్చిన దలైలామా

ఎక్స్ వేదికగా ప్రెస్ నోట్ విడుదల చేసిన బౌద్ధ మతగురువు

Update: 2026-02-08 06:30 GMT

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్ స్టీన్ ఫైల్స్ లో బౌద్ధ మతగురువు దలైలామా పేరు పలుమార్లు ప్రస్తావనకు రావడం తెలిసిందే. అమెరికా న్యాయ శాఖ ఇటీవల విడుదల చేసిన ఫైల్స్ లో ఏకంగా 169 చోట్ల దలైలామా పేరు కనిపించింది. కొన్ని నివేదికలు అక్టోబర్ 2012 నాటి ఈమెయిళ్లను ప్రస్తావించాయి. వీటిలో దలైలామా, ఎప్‌స్టీన్ మధ్య సమావేశం జరిగిందని సూచించే సూచనలు ఉన్నాయని తెలిపాయి. ఇదే కాకుండా దలైలామా అనుచరులగా పేర్కొంటున్న కొంతమంది వ్యక్తులు ఎప్‌స్టీన్‌ను కలిసి ఉండొచ్చని యూరోపియన్ మీడియా సంస్థ నెక్ట్సా టీవీ పేర్కొంది. ఈ విషయంపై నెలకొన్న అనుమానాలకు దలైలామా తాజాగా వివరణ ఇచ్చారు. ఎక్స్ వేదికగా మీడియా ప్రకటన విడుదల చేశారు. మహిళలు, మైనర్లపై లైంగిక నేరాలకు పాల్పడ్డ నిందితుడు జెఫ్రీ ఎప్ స్టీన్ ను తాను ఎన్నడూ కలవలేదని స్పష్టం చేశారు.

ఎప్ స్టీన్ ఫైల్స్ లో తన పేరు ప్రస్తావన, తనపై వస్తున్న ఆరోపణలు అన్నీ నిరాధారమైనవని కొట్టిపారేశారు. ఎప్ స్టీన్ తో కానీ ఆయన ప్రతినిధులతో కానీ తాను ఎన్నడూ ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదని స్పష్టం చేశారు. ఇటీవల కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు, సోషల్ మీడియా పోస్టుల్లో జెఫ్రీ ఎఫ్ స్టీన్ తో దలైలామా సమావేశమైనట్లు చూపించడంపై దలైలామా ఆఫీసు అభ్యంతరం వ్యక్తం చేసింది. దలైలామాపై అసత్య ప్రచారం జరుగుతోందని ఆరోపించింది.

ఇటీవల అమెరికా న్యాయశాఖ ఎప్‌స్టీన్ ఫైళ్లకు సంబంధించి మూడు మిలియన్లకు పైగా పైళ్లు, 2000కి పైగా వీడియోలు, సుమారు 1.8 లక్షల ఫోటోలను రిలీజ్ చేసింది. ఈ పత్రాల్లో అమెరికాకు చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. వీరితో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన వారు కూడా ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్, బిల్ గేట్స్, ఎలాన్ మస్క్ వంటి ప్రముఖులు ఉన్నారు.

Tags:    

Similar News