Texas: టెక్సాస్‌లో మెరుపు వరదలు.. కుటుంబాలకు కుటుంబాలే మృత్యువాత
104కి చేరిన టెక్సాస్ వరద మృతుల సంఖ్య..;
ఆకస్మిక వరదలు టెక్సాస్ నగరాన్ని ఘోరంగా దెబ్బకొట్టింది. ఊహించని రీతిలో వరదలు సంభవించడంతో టెక్సాస్ అతలాకుతలం అయిపోయింది. నెలల తరబడి కురవాల్సిన వర్షం.. కొన్ని గంటల్లోనే కురవడంతో నిమిషాల వ్యవధిలోనే వరదలు ముంచెత్తేశాయి. పైగా వాతావరణ శాఖలో సిబ్బంది కొరత కారణంగా ముందు హెచ్చరికలు కూడా లేవు. దీంతో టెక్సాస్ నగర వాసులు ఊహించని ప్రళయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఒక్కసారిగా జలప్రళయం వచ్చినట్లు విపత్తు సంభవించడంతో కుటుంబాలకు కుటుంబాలే వరదల్లో కొట్టుకుపోయాయి. అర్ధరాత్రి కావడంతో తప్పించుకునే మార్గం లేక ప్రాణాలు పోయాయి.
టెక్సాస్‌లో ఇప్పటి వరకు 104 మంది చనిపోయారని వైట్‌హౌస్ అధికారికంగా ప్రకటించింది. ఇక డజన్ల కొద్దీ గల్లంతైనట్లుగా అధికారులు పేర్కొన్నారు. సమ్మర్ క్యాంప్‌లో ఉన్న పిల్లల ఆచూకీ ఇంకా తెలియలేదు. చెట్లపై అనేక మంది శరీరాలు ప్రత్యక్షమయ్యాయి. చెట్లలోనూ… పుట్టల్లోనూ చిక్కుకున్న మృతదేహాలను సహాయ సిబ్బంది వెలికి తీస్తున్నారు.
కుండపోత వర్షం సంభవించడంతో గ్వాడాలుపే నది 45 నిమిషాల్లో 26 అడుగులు పెరిగిపోయింది. దీంతో ఒక్కసారిగా ఊహించని రీతిలో వరద ముంచెత్తింది. ముందస్తు హెచ్చరికలు లేకపోవడంతో సమ్మర్ క్యాంప్‌లో ఉన్న బాలికలు గల్లంతయ్యారు. ఇంకొందరు అతి కష్టం మీద ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో 28 మంది పిల్లలు ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున టెక్సాస్ ప్రజలంతా మంచి గాఢనిద్రలో ఉన్నారు. అమాంతంగా వర్షాలు సంభవించడంతో నిద్రలోంచి తేరుకోలేకపోయారు. దీంతోనే ఎక్కువ ప్రాణనష్టం జరిగింది. పైగా ముందస్తు హెచ్చరికలు కూడా లేవు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. కానీ అప్పటికే ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్నారు. కానీ తప్పించుకునే మార్గం లేకుండా పోయింది.
ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్.. శుక్రవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఏరియల్ సర్వే నిర్వహించి జరిగిన విపత్తును పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో భేటీ అయి.. జరుగుతున్న సహాయ చర్యలపై అడిగి తెలుసుకోనున్నారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు ట్రంప్ సంతాపం ప్రకటించారు.