Covid Vaccine: తగినన్ని కొవిడ్ టీకాలు తీసుకోకపోవడం వల్లే మరణాలు
బ్రిటన్ నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడి;
వైద్యులు సూచించినట్లుగా కొవిడ్ టీకాలను తీసుకొని ఉంటే ఏడు వేల మరణాలు లేదా ఆస్పత్రిలో చేరడాన్ని నివారించే అవకాశం ఉండేదని బ్రిటన్ నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. కొవిడ్ నుంచి రక్షణ కోసం వృద్ధులు రెండు డోసుల టీకాలను తప్పక తీసుకోవాలని సూచించింది. టీకాల ప్రయోజనాలను ఈ పరిశోధన చాలా బలంగా చెబుతోందని అధ్యయనంలో హెల్త్ డేటా రిసెర్చి ప్రతినిధి తెలిపారు.
నిపుణులు సూచించిన మేర కొవిడ్ టీకా డోసులు తీసుకోకపోతే కూడా మరణాల ముప్పు పొంచి ఉంటుందని యూకే నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. 2022 వేసవి సీజన్‌లోనే దాదాపు ఏడు వేలకు పైగా మరణాలు లేదా ఆస్పత్రుల్లో చేరడాన్ని నివారించే వారని తేలింది. ఈ అధ్యయనాన్ని ది లాన్సెట్ జర్నల్ ప్రచురించింది. జనవరి 2022 నాటికి యూకేలో 12 ఏళ్లు దాటిన వారిలో 90 శాతం ఒక టీకా తీసుకున్నారని కానీ, ఆ తర్వాత రెండోవ డోసు తీసుకున్నవారి శాతం గణనీయంగా తగ్గిపోయిందని పేర్కొంది. జూన్ 2022 నాటికి మొత్తం జనాభాలో కేవలం 44 శాతం మాత్రమే పూర్తి స్థాయి డోసులు, బూస్టర్లు తీసుకున్నారని తెలిపింది. పూర్తి స్థాయిలో టీకాలను తీసుకొని ఉంటే.. ఆ సీజన్‌లో కనీసం ఏడు వేల మరణాలు లేదా ఆస్పత్రుల్లో చేరికలను నివారించే వారమని పరిశోధకులు వెల్లడించారు. ఈ అధ్యయనాన్ని హెల్త్ డేటా రీసెర్చి- యూకే , ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం నిర్వహించాయి.
టీకాల ప్రయోజనాలను ఈ పరిశోధన చాలా బలంగా చెబుతోందని హెల్త్ డేటా రీసెర్చి యూకే ప్రతినిధి అలెన్ కీ వెల్లడించారు. జూన్ 2022 నాటికి ఇంగ్లాండ్‌లో 45.7 శాతం, ఉత్తర ఐర్లాండ్‌లో 49.8 శాతం, స్కాట్లాండ్‌లో 34.2 శాతం, వేల్స్‌లో 32.8 శాతం మంది ఒకటే డోసు తీసుకున్నట్లు అధ్యయనంలో తేలింది. 2022 జూన్-సెప్టెంబర్ మధ్యలో 40,393 మంది కొవిడ్ కారణంగా చనిపోవడమో, ఆస్పత్రుల్లో చేరడమో జరిగిందని లాన్సెట్ జర్నల్ పేర్కొంది. వారిలో 14 వేల 156 మంది తక్కువ డోసులు తీసుకున్నట్లు పరిశోధకులు గుర్తించారని తెలిపింది . కొవిడ్ ప్రభావం వృద్ధులపై అధికంగా ఉందని వెల్లడించింది. కొవిడ్ టీకా ప్రాణాలును కాపాడుతుందని..... కొత్త వేరియంట్లు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందని హెచ్‌డీఆర్ యూకే రీసెర్చి డైరెక్టర్ అజీజ్ షేక్ పేర్కొన్నారు. సమాజంలో ఏ వర్గాలపై దృష్టి పెట్టాలనే విషయాన్ని సులువు చేస్తుందని తెలిపారు.