Donald Trump: అణు కేంద్రాలు ధ్వంసం కాలేదన్న అమెరికా ఇంటెలిజెన్స్.
ఆ రిపోర్టును కొట్టిపారేసిన అధ్యక్షుడు ట్రంప్;
ఇజ్రాయిల్ , ఇరాన్ మధ్య 12 రోజుల యుద్ధానికి బ్రేక్ పడిన విషయం తెలిసిందే. కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రకటన చేయడంతో.. రెండు దేశాలు అంగీకారం తెలిపాయి. ఇక ఆదివారం ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా బీ2 బాంబర్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడిలో అణు కేంద్రాలు ధ్వంసం కాలేదని అమెరికా ఇంటెలిజెన్స్ పేర్కొన్నది. దీనికి సంబంధించిన రిపోర్టు ఒకటి రిలీజైంది. ఫోర్డో, నటాంజ్, ఇస్పాహన్ కేంద్రాలపై జరిగిన దాడులు విఫలమైనట్లు పెంటగాన్ ఇంటెలిజెన్స్ రిపోర్టులో వెల్లడైంది. ఇరాన్ అణు కేంద్రాల్లో ఉన్న సెంట్రిఫ్యూజ్‌లకు ఎటువంటి నష్టం జరగలేదని ఆ నివేదికలో పేర్కొన్నారు. కేవలం భూమి మీదున్న కట్టడాలు మాత్రమే స్వల్పంగా ధ్వంసమైనట్లు తెలిపారు. అణు కేంద్రాల వద్ద ఉన్న ఎంట్రెన్స్‌లు, కొన్ని బిల్డింగ్‌లు ధ్వంసమైనా.. అండర్‌గ్రౌండ్‌లో మాత్రం ఎటువంటి నష్టం జరగలేదన్న రిపోర్టులో వెల్లడించారు.
అణు కేంద్రాలకు నష్టం జరగలేదని వచ్చిన రిపోర్టులను అధ్యక్షుడు ట్రంప్ కొట్టిపారేశారు. ట్రుత్ సోషల్ అకౌంట్‌లో ఓ పోస్టు చేశారు. అమెరికా మీడియాతో పాటు మీడియా సంస్థల రిపోర్టింగ్‌పై ఆయన విమర్శలు చేశారు. సీఎన్ఎన్‌తో పాటు న్యూయార్క్ టైమ్స్ .. అత్యంత విజయవంతంగా సాగిన మిలిటరీ దాడుల్ని తప్పుగా చిత్రీకరిస్తున్నాయని, ఇరాన్‌లో ఉన్న అణు కేంద్రాలు పూర్తి ధ్వంసం అయ్యాయని, సీఎన్ఎన్‌తో పాటు టైమ్స్ వార్తా సంస్థలను ప్రజలు విమర్శిస్తున్నారని ట్రంప్ పేర్కొన్నారు.