Donald Trump: నేను గానీ ఎన్నికల్లో ఓడిపోతే.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇక జీవితంలో మరోసారి బరిలో నిలవనని మాజీ అధ్యక్షుడు;
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గనుక ఓడిపోతే.. ఇక జీవితంలో మరోసారి బరిలో నిలవనని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారాయన. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరందుకోంది. అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఓ ఇంటర్య్వూలో కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 5న జరగబోయే ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ పోటీ చేయబోనని ప్రకటించారు. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టంచేశారు. ఇప్పుడే విజయం సాధిస్తాననే నమ్మకం ఉందని వెల్లడించారు. 78 ఏళ్ల ట్రంప్ ఇప్పటికే ఒకసారి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే.
‘‘ఈసారి అధ్యక్ష ఎన్నికలో గెలుపు కోసం శాయశక్తుల కృషి చేస్తా. ఈసారి ఓడిపోయే ప్రసక్తే ఉండదని అనుకుంటున్నా. ఎందుకంటే అమెరికన్లలో డెమోక్రట్లపై అంతలా వ్యతిరేకత పెరిగిపోయింది. ఒకవేళ ఓటమి పరిస్థితే ఎదురైతే మాత్రం.. ఇక శాశ్వతంగా పోటీకి దూరమవుతా. ఇంకోసారి పోటీ చేయను’’ అని ట్రంప్ ప్రకటించారు.
అమెరికాకు 45వ అధ్యక్షుడి కోసం జరిగిన 2016 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేశారు ట్రంప్. ప్రత్యర్థి హిలరీ క్లింటన్‌పై ఘన విజయం సాధించి.. 2017 నుంచి 2021 (జనవరి) మధ్య అధ్యక్షుడిగా పని చేశారు. 2021 ఎన్నికల్లో బైడెన్‌పై మరోసారి పోటీ చేస్తానని 2020లోనే ట్రంప్ ప్రకటించారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు.
ముచ్చటగా మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో నిలబడతానని.. 2022 నవంబర్ నుంచే చెబుతూ వస్తున్నారు. ఈ ఏడాది ఆయన అభ్యర్థిత్వం ఖరారు కాగా.. నాటకీయ పరిణామాల అనంతరం బైడెన్ వైదొలగడంతో కమలా హారిస్ తెర మీదకు వచ్చారు.
నవంబర్ 5న 47వ అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ట్రంప్‌కు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ నుంచి గట్టి పోటీ ఎదురు కావొచ్చని సర్వేలు చెబుతున్నాయి. కీలక రాష్ట్రాల్లోనూ కమలదే పైచేయి కొనసాగుతోందని నివేదికలు ఇస్తున్నాయి. తొలి డిబేట్‌లో బైడెన్‌పై నెగ్గిన ట్రంప్.. రెండో డిబేట్‌లో కమలా హారిస్‌పై మాత్రం ఆయన తడబడ్డారు. దీంతో మూడో(ఆఖరి)డిబేట్‌కు దూరంగా ఉంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 23వ తేదీన మూడో డిబేట్ జరగాల్సి ఉంది. ఇప్పటికే తాను డిబేట్‌కు రెడీ అంటూ కమల ప్రకటించారు. ఈ సవాల్‌ను ట్రంప్ అంగీకరిస్తారో? లేదో? అనే ఆసక్తి నెలకొంది.