Donald Trump: ట్రంప్‌కు అత్యున్నత పురస్కరం ప్రకటించిన ఇజ్రాయెల్

నోబెల్‌ శాంతి మిస్సైన వేళ.. ట్రంప్‌ను వరించిన అత్యున్నత పౌర పురస్కారం

Update: 2025-10-13 06:30 GMT

దాదాపు రెండేళ్ల తర్వాత హమాస్-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా సోమవారం మూడు విడతలుగా బందీలను విడుదల చేస్తామని హమాస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తొలి విడతగా ఏడుగురు బందీలను హమాస్ విడుదల చేసింది. రెడ్‌క్రాస్ బృందానికి బందీలను అప్పగించారు. దీంతో ఇజ్రాయెల్‌లో పండుగ వాతావరణం నెలకొంది. రెండేళ్ల తర్వాత తమ వారు క్షేమంగా రావడంపై ఆనంద భాష్పాలు చిందింస్తున్నారు. దేశమంతటా హర్షధ్వానాలు వినబడుతున్నాయి. థ్యాంక్యూ ట్రంప్ అంటూ భారీ ఎత్తున ప్లకార్డులు ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉంటే బందీల విడుదల సమయంలో ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రంప్‌కు అత్యున్నత పురస్కారం అందించాలని ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకుంది. ‘ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ ఆఫ్‌ ఆనర్‌’ను ట్రంప్‌కు ప్రదానం చేయనున్నట్లు ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు ఇస్సాక్‌ హెర్జోగ్‌ వెల్లడించారు. త్వరలోనే సమయం, వేదిక నిర్ణయించి అందించనున్నట్లు తెలిపారు. శాంతి ఒప్పందం జరగడంలో.. బందీల విడుదల విషయంలో ట్రంప్ చేసిన కృషికి గాను ఈ పురస్కరాన్ని అందిస్తున్నట్లు ఇస్సాక్ హెర్జోగ్ తెలిపారు.

ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఇజ్రాయెల్ బయల్దేరే ముందు అమెరికాలో మాట్లాడుతూ గాజా యుద్ధం ముగిసిందని తెలిపారు. ఇప్పటి వరకు తాను చేసిన అతి పెద్ద శాంతి ఒప్పందాల్లో ఇజ్రాయెల్-హమాస్ మధ్య చేసిందేనని పేర్కొన్నారు. త్వరలో పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ యుద్ధాన్ని కూడా ముగిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇక సోమవారం ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ట్రంప్ ప్రసంగించనున్నారు. అనంతరం బందీల కుటుంబాలతో సమావేశం కానున్నారు. అక్కడ నుంచి ఈజిప్టుకు వెళ్లి శాంతి ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు.

Tags:    

Similar News