Earthquake: మయన్మార్ మృత్యుఘోష, విపత్తులో 1,600 మందికి పైగా మృతి
3,400 మందికి పైగా క్షతగాత్రులు;
శుక్రవారం వరుస భూ కపంపాలతో వణికిపోయిన మయన్మార్‌లో శనివారం మరోసారి భూప్రకంపనలు నమోదయ్యాయి. మధ్యాహ్నం 2.50 గంటల సమయంలో 4.7 తీవ్రతతో భూమి కంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. కాగా శుక్రవారం నాటి భూకంప మృతుల సంఖ్య 1644 దాటింది. శనివారం అనేక భవనాల శిథిలాల నుంచి మృతదేహాల వెలికితీత కొనసాగింది. మృతుల సంఖ్య 10 వేలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 3,408 మంది గాయపడ్డారని, మరో 139 మంది గల్లంతయ్యారని మయన్మార్ సైనిక ప్రభు త్వం ప్రకటించింది. కాగా, భూకంప మరణాల సంఖ్య ఊహించని స్థాయిలో ఉండవచ్చని వార్తలు వస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం వచ్చిన వరుస భూకంపాల ధాటికి నగరంలోని అనేక బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టం కాగా రోడ్లు చీలిపోవడంతో వంతెనలు కూలిపోయాయి. ఒక డ్యామ్ బద్ధలైంది. పొరుగున ఉన్న థాయ్‌ల్యాండ్‌లో కూడా భూకంపం తీవ్రతకు గ్రేటర్ బ్యాంకాక్ ప్రాంతంలోని అనేక భవనాలు కూలిపోయాయి. శిథిలాల నుంచి ఇప్పటివరకు 6 మృతదేహాలను వెలికితీయగా 26 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. మరో 47 మంది ఆచూకీ తెలియడం లేదని వారు చెప్పారు. కాగా, శుక్రవారం బ్యాంకాక్‌లో పురిటి నొప్పులతో బాధ పడుతున్న మహిళకు వైద్యులు ఓ పార్కులో డెలివరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ప్రపంచ దేశాల సాయం
వరుస భూప్రకంపనలతో తల్లడిల్లుతున్న మయన్మార్‌కు ప్రపంచ దేశాల ఆపన్న హస్తం అందించాయి. చైనా, హాంకాంగ్, భారత్ పదుల సంఖ్యలో సహాయక సిబ్బందిని మయన్మార్‌కు పంపాయి. హాంకాంగ్, భారత్ సహాయక సామాగ్రి, ఔషధాల వంటి సామాగ్రి అందించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మయన్మార్‌కు సాయం చేస్తామని ప్రకటించారు. యూరోపియన్ యూనియన్ 27 లక్షల డాలర్లను మయన్మార్‌కు తక్షణ సహాయంగా ప్రకటించింది.
సైనిక పాలన, అంతర్యుద్ధాలతో మగ్గిపోతున్న మయన్మార్ ప్రజలపై భూకంప విపత్తు గోరు చుట్టుపై రోకలి పోటులా మారింది. వివిధ దేశాల నుంచి వస్తోన్న సహాయక బృందాలు భూకంప తాకిడి ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు ఆయా చోట్ల ప్రభుత్వ, తిరుగుబాటు దళాల మధ్య జరుగుతోన్న ఘర్షణలు అవరోధంగా మారాయి. శనివారం నాడూ దేశంలోని ఉత్తర ప్రాంతంలో సాయుధ దాడులు కొనసాగాయి. దీనివల్ల అంతర్జాతీయ సహాయక బృందాలు మారుమూల ప్రాంతాలకు చేరుకోలేకపోతున్నాయి.