Earthquake: హడలెత్తిపోతున్న ప్రజలు.. ఆప్ఘనిస్థాన్‌లో మళ్లీ భూకంపం..
రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.8గా నమోదు
ఆప్ఘనిస్థాన్‌ను మరోసారి భూకంపం వణికించింది. మూడు రోజుల క్రితం వచ్చిన భారీ భూకంపం నుంచే ఇంకా తేరుకోలేదు. తాజాగా గురువారం కూడా మరోసారి భూకంపం హడలెత్తించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.8గా నమోదైంది. 135 కి.మీ లోతులో ఈ భూకంపం సంభవించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
బుధవారం రాత్రి కూడా 4.3 తీవ్రతతో ఒకసారి భూకంపం వచ్చిందని.. కొన్ని గంటల వ్యవధిలోనే మళ్లీ 4.8 తీవ్రత భూకంపం వచ్చినట్లుగా అధికారులు చెప్పారు. ఇటీవల వచ్చిన భూకంపంతోనే ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తేరుకునేలోపే వరుస భూప్రకంపనలు రావడంతో హడలెత్తిపోతున్నారు. ఆస్తి, ప్రాణ నష్టంపై అధికారులు ఇంకా వివరాలు వెల్లడించలేదు. అలాగే మయన్మార్‌లో కూడా భూకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.7గా నమోదైంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
ఇక ఆదివారం-సోమవారం అర్ధరాత్రి వచ్చిన భూకంపం తీవ్ర ప్రాణనష్టాన్ని కలిగించింది. దాదాపు 800 మంది ప్రాణాలు కోల్పోగా.. 1400 మందికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అలాగే శిథిలాల తొలగింపు కూడా కొనసాగుతోంది.