EU: ట్రంప్ దూకుడుకు ట్రేడ్ బజూకాతో ఈయూ జవాబు..!
తొలిసారి ట్రేడ్ బజూకా అస్త్రాన్ని వాడనున్నట్లు సంకేతాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు యురోపియన్ యూనియన్ (ఈయూ) షాక్ ఇవ్వనున్నట్లు సమాచారం. గ్రీన్ లాండ్ ఆక్రమణను వ్యతిరేకించిన 8 యురోపియన్ దేశాలపై ట్రంప్ 10 శాతం టారిఫ్ లు విధించిన విషయం తెలిసిందే. వచ్చే నెల 1 నుంచి ఈ టారిఫ్ లు అమలు చేస్తామని ట్రంప్ చెప్పారు. దీనిపై ఈయూ దేశాలు తీవ్రంగా మండిపడ్డాయి. ట్రంప్ దూకుడుకు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఈయూ వాణిజ్య ఆయుధం ‘ట్రేడ్ బజూక’ను తొలిసారి వాడాలని చూస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
బ్రస్సెల్స్ లో ఈయూ దేశాల భేటీ..
బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో ఈయూ దేశాల ప్రతినిధులు ఆదివారం అత్యవసరంగా భేటీ అయ్యారు. ట్రంప్ టారిఫ్ లను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ బెదిరింపులకు లొంగబోమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ స్పష్టం చేశారు.యురోపియన్ యూనియన్ కు చెందిన ట్రేడ్ బజూకను ఉపయోగించే విషయంపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలిపారు.
వాణిజ్య ఆయుధం ట్రేడ్ బజూకా..
ఈయూయేతర దేశాల ఆర్థిక ఒత్తిడి నుంచి తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఈయూ దేశాలు రూపొందించుకున్న వ్యవస్థే ‘ట్రేడ్ బజూకా’. దీంతో కౌంటర్ టారిఫ్‌లు విధించే అవకాశం లభిస్తుంది. ట్రేడ్ బజూకాను ప్రయోగిస్తే అమెరికా వస్తుసేవలను ఐరోపా మార్కెట్ లో విక్రయించడంపై పరిమితులు విధించవచ్చు. ఈయూ కాంట్రాక్ట్‌ల విషయంలో అమెరికన్ కంపెనీల బిడ్డింగ్‌ను నిరోధించవచ్చు.