Hafiz Saeed: లష్కరే కమాండర్‌ సయూద్‌కు పాక్‌ ప్రభుత్వ భద్రత

ఇంటి ముందు గార్డులు.. ఇంటి కింద బంకర్‌..;

Update: 2025-05-01 01:15 GMT

జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్‌గామ్‌ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా టాప్‌ కమాండర్‌  హఫీజ్‌ సయీద్‌  హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడికి పాల్పడింది తామే అని ‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టీఆర్‌ఎఫ్‌)’ ప్రకటించినప్పటికీ.. దీని వెనుక హఫీజ్‌ హస్తం ఉందని ఇప్పటికే పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే, ఈ కరుడుగట్టిన ఉగ్రవాదికి పాకిస్థాన్‌ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తుండటం గమనార్హం.

హఫీజ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది అయినప్పటికీ రహస్య ప్రదేశంలో కాకుండా.. లాహోర్‌ (Lahore)లోని జోరమ్‌ తౌమ్‌ అనే అత్యంత రద్దీ ప్రాంతంలో తన ఫ్యామిలీతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడికి పాక్‌ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తుండటం గమనార్హం. హఫీజ్‌ నివాసం వద్ద పాక్‌ ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం భద్రత కల్పిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడిస్తోంది. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు కూడా ప్రస్తుతం బయటకు వచ్చాయి. హఫీజ్‌ ఇంటి వద్ద 24×7 ప్రభుత్వం భద్రత కల్పిస్తున్నట్లు సమాచారం. అతని ఇంటి వద్ద పార్క్‌, మసీదు, మదర్సాలు కూడా ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. భవనం కింద ఓ బంకర్‌ కూడా ఉందని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

అయితే పాక్‌ ప్రభుత్వం మాత్రం హఫీజ్‌ జైల్లో ఉన్నాడంటూ బుకాయిస్తుండటం ఆందోళన కలిగించే విషయం. ఉగ్ర సంస్థకు నిధులు సమకూర్చిన కేసులో అతడికి 31 ఏళ్ల జైలు శిక్ష పడిందని, అతడు జైల్లోనే ఉన్నాడని వాదిస్తోంది. కానీ, హఫీజ్‌ మాత్రం చాలా ఏళ్లుగా బహిరంగంగా ప్రజల మధ్యలోనే స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు సదరు కథనాలు పేర్కొంటున్నాయి.

లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉండే కరుడుగట్టిన ఉగ్రవాదుల బృందం ఈనెల 22న బైసరాన్‌లో నిర్దాక్షిణ్యంగా 26 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే. నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఆ బృందంలో ప్రధానంగా విదేశీ ఉగ్రవాదులు ఉంటారు. ఆ ఉగ్రవాదులకు స్థానిక ఉగ్రవాదులతోపాటు కశ్మీర్‌లో మద్దతుదారులు కొందరు సహకరించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్‌ ప్రభుత్వ మద్దతుతో హఫీజ్ సయీద్, అతడి ముఖ్య అనుచరులు ఈ ఉగ్రమూకలకు నేరుగా సాయపడి ఉండవచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ముంబైలో 26/11 దాడికి కారకుడైన హఫీజ్ సయీద్ ఈ దాడిలో పాల్గొన్న టెరరిస్టులకు కూడా అన్ని రకాలుగా సహాయసహకారాలు అందించి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రదాడికి పాల్పడిన బృందం చాలాకాలంగా కశ్మీర్‌ లోయలో క్రియాశీలకంగా ఉన్నట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది సోనామార్గ్, బూతాపత్రీ, గండేర్బల్ దాడుల్లో ఈ బృందమే పాలుపంచుకున్నట్లు తెలిసింది. గత అక్టోబర్‌లో బూతాపత్రిలో జరిగిన దాడిలో ఇద్దరు ఆర్మీ జవాన్లు సహా మొత్తం నలుగురు మృతి చెందారు. అదే నెలలో సోనామార్గ్ టెన్నెల్ కార్మికులను టార్గెట్ చేస్తూ జరిగిన దాడిలో ఆరుగురు కార్మికులతో పాటు ఓ డాక్టర్ మరణించారు. ఇక సయూద్‌ను భారత్‌ మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి కూడా అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడి తలపై అమెరికా 10 మిలియన్‌ డాలర్ల రివార్డ్‌ ప్రకటించింది.

Tags:    

Similar News