Turkey: తుర్కియే పార్లమెంటులో గందరగోళం..కొట్టుకున్న అధికార-విపక్ష ఎంపీలు

సోషల్ మీడియాలో వీడియో వైరల్

Update: 2026-02-12 05:15 GMT

 తుర్కియే   పార్లమెంటులో సభ్యులు గందరగోళం సృష్టించారు. కొత్త న్యాయశాఖ మంత్రి నియామకంపై జరిగిన ఘర్షణల్లో నేతలు పరస్పరం దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ఇస్తాంబుల్‌ చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ అయిన అకిన్‌ గుర్లెక్‌ను కొత్త న్యాయశాఖ మంత్రిగా.. తుర్కియే అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ నియమించారు. గుర్లెక్‌ బుధవారం ప్రమాణస్వీకారానికి సిద్ధమవగా.. దాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు పోడియం వద్దకు దూసుకొచ్చాయి. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఘర్షణ చెలరేగింది. నేతలు పరస్పరం తోసుకుంటూ.. దాడి చేసుకున్నారు. పార్లమెంటులో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో.. స్పీకర్‌ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. కొంతసేపటి తర్వాత తిరిగి సమావేశం ప్రారంభమవగా.. అధికార పార్టీ నేతలు గుర్లెక్‌ చుట్టూ రక్షణగా నిలబడి ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.

న్యాయమంత్రిత్వ శాఖకు అధిపతిగా గుర్లెక్‌ నియామకంపై ప్రధాన ప్రతిపక్షం రిపబ్లికన్‌ పీపుల్స్‌ పార్టీ (CHP) తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేసింది. గుర్లెక్‌ ఇస్తాంబుల్‌ చీఫ్‌ ప్రాసిక్యూటర్‌గా ఉన్న సమయంలో సీహెచ్‌పీ సభ్యులతో సంబంధం ఉన్న అనేక కేసులను ఆయన పర్యవేక్షించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని లక్ష్యంగా చేసుకోవడానికి ఈ నియామకం చేపట్టారని, ఇది న్యాయ స్వేచ్ఛను కూడా దెబ్బతీస్తుందని సీహెచ్‌పీ విమర్శలు చేసింది.

Tags:    

Similar News