వీలైనంత మేర చుట్టుపక్కల దేశాల భూభాగాన్ని తమది చెప్పుకుంటూ తప్పుడు ప్రచారం చేసుకునే చైనా తీరును మాజీ సైన్యాధ్యక్షుడు జనరల్ నరవణె ఎండగట్టారు. చైనా అసలు భూభాగం ఎంతవరకు ఉందో పూర్తి వివరాలతో మ్యాప్ విడుదల చేశారు. ఇదేసమయంలో చైనా ఆక్రమించుకున్న భూభాగాలను కూడా ఆయన బయటపెట్టారు.
విస్తరణవాదంతో ఊగిపోతున్న చైనా వాస్తవ భూభాగంపై భారత సైన్యం మాజీ అధ్యక్షుడు జనరల్ MM నరవణే కీలక వివరాలు బయటపెట్టారు. ఇతర దేశాల భూభాగాలను కలుపుకొంటూ తప్పుడు మ్యాప్‌లను విడుదల చేస్తున్న చైనా తీరును సామాజిక మధ్యమం ఎక్స్ ద్వారా ఎండగట్టారు. చైనా అసలు మ్యాప్‌ను ఆయన విడుదల చేశారు. ఆ మ్యాప్ ను పోస్టు చేసిన మాజీ ఆర్మీ చీఫ్.. ఫైనల్లీ నిజమైన చైనా మ్యాప్ ను పొందగలిగారు అంటూ రాశారు. ఈ మ్యాప్ లో లడఖ్, టిబెట్ సహా అనేక ప్రాంతాలను ఆక్యుపైడ్ (ఆక్రమిత) ప్రాంతాలుగా గుర్తించి ఉంది. చైనా, చైనా ఆక్రమిత టిబెట్, చైనా ఆక్రమిత ఈస్ట్ తుర్ఖేస్థాన్, చైనా ఆక్రమిత సౌత్ మాంగోలియా, చైనా ఆక్రమిత మంచూరియా, చైనా ఆక్రమిత యునాన్, చైనా ఆక్రమిత లడఖ్ అని ఆ మ్యాప్ లో రాసి ఉంది.
చైనా ఇమేజినరీ స్టాండర్ట్ మ్యాప్ విడుదల చేసిన కొద్దిరోజులకే ఈ వివరాలను జనరల్ నరవణే వెల్లడించారు. చైనా ఆగస్టు 28న విడుదల చేసిన మ్యాప్‌లో అరుణాచల్‌ప్రదేశ్, ఆక్సాయ్‌సిన్ ప్రాంతాన్ని కూడా తమ భూభాగంగా డ్రాగన్ చెప్పుకుంది. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఒకే వేదిక పంచుకున్న తర్వాత ఈ మ్యాప్‌ను విడుదల చేసి కవ్వింపు చర్యలకు దిగింది. ఈ వ్యవహారంపై మండిపడిన భారత విదేశాంగ శాఖ.... దౌత్యమార్గాల్లో తమ నిరసనను చైనాకు తెలియజేసింది. మరోవైపు రష్యా., మలేసియా, ఫిలిప్పీన్స్ కూడా చైనా విడుదల చేసిన మ్యాప్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. దక్షిణ చైనా సముద్రం తనదే అంటూ చైనా చేస్తున్న ప్రయత్నాలను ఆసియా దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కోడ్ ఆఫ్ కండక్ట్ ను పాటించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాయి.