Chile Former President Dies: హెలికాప్టర్ ప్రమాదంలో చిలీ మాజీ అధ్యక్షుడు మృతి
మరో ముగ్గురికి గాయాలు;
చిలీ దేశంలో హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా మృతి చెందాడు. నలుగురు వ్యక్తులతో కలిసి పినేరా ప్రయాణిస్తుండగా హెలికాప్టర్ కూలిపోయింది. దీంతో ఆయన మృతిచెందగా, మిగతావారు గాయాలతో బయటపడ్డారు. 74 ఏళ్ల మాజీ అధ్యక్షుడి ఈ విషాదకర మరణాన్ని అంతర్గత మంత్రి కరోలినా తోహా ధృవీకరించారు. మరోవైపు సెబాస్టియన్ పినేరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆ దేశ ఆర్మీ ప్రకటించింది. పినేరా మృతి పట్ల దక్షిణ అమెరికా దేశాధినేతలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
దక్షిణ పట్టణం లాగో రాంకోలో హెలికాప్టర్ ప్రమాదంలో మరో ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పినెరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తోహా తెలిపారు. పినెరా దేశాధ్యక్షుడు కాకముందు విజయవంతమైన వ్యాపారవేత్త. ఆయన మొదటి సారి అధ్యక్షుడిగా మారిన2010 నుండి 2014 పదవి కాలంలో దేశంలో ఆర్థిక వృద్ధిని సాధించడంలో విజయం సాధించారు. ఆయన పదవీ కాలంలో నిరుద్యోగం కూడా బాగా తగ్గింది. పినేరా మృతి పట్ల అధ్యక్షుడు గ్రాబియేల్ బోరిక్ మూడు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బిలియనీర్ అయిన ఆయన చిలీలోని అత్యంత ధనికుల్లో ఒకరిగా ఉన్నారు. మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత 2010లో అటాకామా ఎడారిలో చిక్కుకున్న 33 మంది మైనర్‌లను రక్షించడం ఆయన పాలనలో తరచుగా గుర్తు చేసుకునే అద్భుతమైన ఘటనల్లో ఒకటి. ఆ సమయంలో ఈ సంఘటన గ్లోబల్ మీడియా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంతోనే 2014లో"ది 33" అనే సినిమా తీశారు. ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి సమయంలో పినెరా అధికారంలో ఉన్నారు. దేశంలో కోవిడ్ 19 కట్టడిలో సమర్థంగా పనిచేశారు. ఆ సమయంలో ప్రవేశపెట్టిన టీకా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన టీకాగా గుర్తించబడింది. సెబాస్టియన్ పినెరా ప్రముఖ రాజకీయవేత్త కుమారుడు, హార్వర్డ్ లో-శిక్షణ పొందిన ఆర్థికవేత్త. ఆయన 1980లలో చిలీకి క్రెడిట్ కార్డ్‌లను పరిచయం చేశారు.